Aug 24,2023 21:31

చేనేత వస్త్ర ప్రదర్శనను తిలకిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* 28 వరకు వస్త్రాల విక్రయాలు
* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను జిల్లా ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయాలను నగరంలోని వైఎస్‌ఆర్‌ మున్సిపల్‌ కళ్యాణ మండపంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జిల్లా చేనేత వస్త్రాలకు మంచి పేరుందన్నారు. జిల్లా ప్రజలే చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించుకొని స్పందనకు హాజరు కావాలని చెప్పారు. జిల్లాలో నాలుగు క్లస్టర్లకు రూ.నాలుగు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద వృత్తి చేనేత రంగమన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలకు మార్కెటింగ్‌ ప్రధాన సమస్య అని, ఈ సమస్యను అధిగమించి కార్మికులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఇటువంటి వస్త్ర ప్రదర్శనలను ఏర్పాటు చేసి విక్రయించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు 20 స్టాల్స్‌ ద్వారా వస్త్ర ప్రదర్శనతో పాటు విక్రయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేయూతనందించాలని పిలుపునిచ్చారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఐ.ధర్మారావు మాట్లాడుతూ పొందూరు, అంపోలు, కొరసవాడ, అక్కులపేట, తోలాపి, అలికాం, సింగుపురంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పొందూరు ఖద్దరు, జమదానీ కాటన్‌ చీరలు, కాటన్‌, సిల్క్‌, సాదాచీరలు, మంగళగిరి, డ్రెస్‌ మెటీరియల్స్‌, కలంకారీ వస్త్రాలు, తువ్వాళ్లు, లుంగీలు తదితర చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తక్కువ ధరకే లభించే వస్త్రాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, డిపిఆర్‌ఒ కె.బాలమాన్‌ సింగ్‌, డెవలప్‌మెంట్‌ అధికారులు ఆర్‌.శేఖర్‌, ఎస్‌.శ్రీను, ఎండిఒ ఇ.రమేష్‌, పలు సహకార ఉత్పత్తి విక్రయ సంఘాల అధ్యక్షులు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.