
ప్రజాశక్తి - బాపట్ల
చేనేతకు చేయూతనిచ్చి చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత వస్త్రాలను ధరించాలని జడ్పిటిసి ఎస్తేరు రాణి అన్నారు. స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవాసమితి ఆధ్వర్యంలో చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రదర్శనను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాలు నాణ్యత, మన్నికతో అందంగా ఉంటాయని అన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు దొరుకుతాయని అన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులు పోచంపల్లి, నారాయణపేట, మంగళగిరి, కలంకారి బెడ్ షీట్లు రకరకాల డిజైన్లుతో కూడిన వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తాయని అన్నారు. ఈ ప్రదర్శను తిలకించి చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి చేనేత కార్మికులకు చేయూతనిచ్చి జీవనోపాధికి తోర్పడాలని కోరారు. ఈ ప్రదర్శన ఈనెల 16వరకు ఉంటుందని తెలిపారు. అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ప్రదర్శన ఆర్గనైజర్ బట్టు సురేష్, అందే సింహద్రి పాల్గొన్నారు.