ప్రజాశక్తి-యంత్రాంగం
రెక్కాడినా డొక్కాడని చేనేతన్నకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న పన్నుపోటు భారంగా మారింది. నిత్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగంపై 5 శాతం జిఎస్‌టి భారం తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రంలోని బిజెపి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూవస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి 5 శాతం జిఎస్‌టిని చేనేతపై విధించింది. నాటి నుంచి జిఎస్‌టి తొలగించాలని చేనేత కార్మికులు, సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బ కొట్టింది. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి చేనేత రంగానికి సంబంధించిన పట్టు, నూలు, రంగులను జిఎస్‌టి నుంచి మినహాయించి కార్మికులను ఆదుకోవాలని పదేపదే ఆందోళనలు, విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెడచెవిన పెడుతూవస్తోంది. చేనేతను ఇంత నిర్లక్ష్యం చేసిన మోడీ సర్కార్ ఇప్పుడు గుజరాత్ వ్యాపారులు అడిగిందే తడవుగా సూరత్ జరీపై జిఎస్‌టిని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనిపై చేనేత కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ఇప్పటికైనా వివక్ష పూరిత విధానాలు మార్చుకోవాలని, లేదంటే మూల్యం చెల్లించకతప్పదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. చేనేతకు సంబంధించిన పట్టు, నూలు, రంగులపై జిఎస్‌టిని పూర్తిగా ఎత్తివేయాలని పలురువు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
మోడీ సర్కార్ ఆది నుంచి కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది. చాలా సంవ త్సరాలుగా పట్టుపై జిఎస్‌టిని మినహాయించాలని డిమాండు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కేంద్రం కేవలం గుజరాత్ జరీ పరిశ్రమ రక్షణ కోసం జిఎస్‌టిని 12 శాతం నుంచి ఏకంగా 5 శాతానికి తగ్గించింది. కేంద్రం ఇప్పటికైనా వివక్ష పూరిత విధానాలు మార్చుకోవాలి. చేనేతలకు భారం తగ్గించాలి.
- గంజి మధు, చేనేత కార్మికుడు, బద్వేలు.
ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్లక్ష్యానికి గురిచేసే ప్రయత్నాలు మానుకోవాలి. జిఎస్‌టి నుంచి చేనేత రంగానికి సంబంధించిన పట్టు, నూలు, రంగులను మినహాయించి కార్మికులను ఆదుకోవాలి. జిఎస్‌టిని పూర్తిగా రద్దు చేయాలి.
- ఎం.వెంకటేశ్వర్లు, చేనేత కార్మికుడు, మైదుకూరు.
చేనేతపై 5 శాతంగా ఉన్న జిఎస్‌టిని రద్దు చేయాలి. జిఎస్‌టిని తొలగించాలని చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. చేనేతకు సంబంధించిన పట్టు, నూలు, రంగులపై జిఎస్‌టిని పూర్తిగా ఎత్తివేయాలి. చేనేత మగ్గంపై తయారు చేసే బట్టలకు, మిల్లులలో తయారు చేసే బట్టలకు చాలా వ్యత్యాసం ఉందని ప్రభుత్వం గమనించి చేనేత కార్మికుల కష్టాలను గుర్తించాలి.
- పి.రమేష్ బాబు, చేనేత కార్మికుడు, మైదుకూరు.
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై వేంటనే జిఎస్‌టినిఇ తగ్గించాలి. గుజరాత్‌లో వస్త్రాలపై జిఎస్‌టి తగ్గించి ఇతర ప్రాంతాల్లో చేనేత కార్మికులనేసే వస్త్రాలకు జిఎస్‌టి తగ్గించకుండా కడుపు కొట్టడం దుర్మార్గమైన చర్య. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి 2017లో జిఎస్‌టి తగ్గిస్తామంటూ మాటలు చెప్పి తగ్గించకుండా చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది.
- కె.శాంతమ్మ, చేనేత కార్మికురాలు, రాయచోటి.
చేనేత రంగంలో కార్పొరేట్ రంగ జోక్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారించాలి. చేనేతపై జిఎస్‌టి ఎత్తివేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి. సామాన్యుల చేనేత కార్మికులపై జిఎస్‌టి అనే ఒక పెన్నుభూతాన్ని మోపడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. చిన్నచిన్న చేనేత కార్మికులు పూట గడవడం కోసం కులవృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు.
- బొమ్మిశెట్టి జయచంద్ర, చేనేత కార్మికుడు, వల్లూరు.
చేనేతలపై కేంద్రం విధించే పన్నులను ఎత్తేసి న్యాయం చేయాలి. పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ వేర్వేరు వాటిని ఒకేలా చూపడం వలన నష్టపోతున్నాం. చేనేతలతో విచారణ జరిపి న్యాయం చేయాలి.
- సంజీవ రాయుడు, చేనేత కార్మికుడు, మైలవరం.
ప్రజల మాన ప్రాణాలను కాపాడేవి దుస్తులు. అలాంటి దుస్తులను నేసే మాపై కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పన్నులతో నిలువునా మోసం చేయడం తగదు. ప్రభుత్వాలు పన్నులను తగ్గించి, మా ప్రాణాలు కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలి.
- ముని కుమార్, చేనేత కార్మికుడు, జమ్మలమడుగు.
చేనేతలపై కేంద్ర ప్రేమ చూపిస్తూ కార్పొరేట్ల కొమ్ము కాస్తుందని అన్నారు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్ను తుందన్నారు నూలు,పట్టు రంగులపై జిఎస్‌టిని పూర్తిగా ఎత్తేసి చేనేతను ఆదుకోవాలని కోరారు
- కనకరాజు, చేనేత కార్మికుడు, ప్రొద్దుటూరు.
చేనేత రంగంపై ఉన్న ఐదు శాతం జిఎస్‌టిని తగ్గించాలి. చేనేతల కోరుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చేనేత కడుపు కొడుతోంది. చేసిన పనికి సరైన కూలి దొరకక చేనేతలు కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుస్తోంది.
- వెంకట రాముడు, చేనేత కార్మికుడు, ప్రొద్దుటూరు.










