Oct 20,2023 23:15

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాల్లో చేనేత ఉత్పత్తులకు విస్తత ప్రచారం, ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకూ 5 రోజుల పాటు హ్యాండ్‌ లూమ్‌ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. ఖాదీ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం కాకినాడ దేవాలయం వీధి పైడా చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 31 వరకు ఖాదీ మహోత్సవ్‌ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో చేనేత ఉత్పత్తులకు విస్తత ప్రచారం ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం భారత ప్రభుత్వ చేనేత శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో నేటి నుంచి ఐదు రోజులపాటు హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో చేనేత కార్మికులు, హస్త కళాకారులు, ఖాదీ సొసైటీలు తయారు చేసిన వస్తువులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్ముకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హ్యాండ్లూమ్‌ ఎక్స్‌ పో కార్యక్రమంలో 27 స్టాళ్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందులో 23 స్టాళ్లు హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులకు కేటాయించగా రెండు స్టాళ్లు హ్యాండీ క్రాఫ్ట్స్‌కు రెండు స్టాళ్లు ఖాదీ ఉత్పత్తులకు కేటాయించారన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనలో రాయలసీమ నుండి ఉత్తర కోస్తా వరకూ వున్న 14 జిల్లాలతో పాటు తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి వరంగల్‌ చెందిన వస్త్రాలతో స్టాళ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నాణ్యతతో కూడిన ఉప్పాడ, మంగళగిరి, చీరాల, శ్రీకాళహస్తి, కలంకారీ రకాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రదర్శించినట్లు కలెక్టర్‌ వివరించారు. దసరా పండుగ పురస్కరించకుని ముందుగానే కాకినాడలో ఏర్పాటు చేసిన చేనేత ఎక్స్‌పో వస్త్ర ప్రదర్శనను కుటుంబ సమేతంగా సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కృతికా శ క్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ చేనేత శాఖ డిడి అనిల్‌ సాహు, కన్సల్టెంట్‌ హిమజ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.