ప్రజాశక్తి - మంగళగిరి : రాష్ట్రవ్యాప్తంగా చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో పనిచేస్తున్న చేనేత కార్మిక సంఘాల ఉద్యమ బాట పట్టాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. మంగళగిరిలోని పోట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో శనివారం రాత్రి నిర్వహించిన సమావేశానికి పి.బాలకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజా సంఘాల నాయకులు వై.కోటేశ్వరరావు మాట్లాడుతూ చేనేత సమస్యలు తక్షణమే పరిష్కరించకుంటే 19న కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేస్తామని, స్పందనలో వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన రూ.2.70 లక్షల కోట్ల బడ్జెట్లో చేనేతకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించగా కేంద్ర ప్రభుత్వం తన రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లోనూ రూ.200 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని విమర్శించారు. ఈ కేటాయింపులు చేనేతకే అవమానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూలు ధరపై సబ్సిడీ, రిబేటు, త్రిఫ్ట్‌ఫండ్, పావలా వడ్డీ వంటి పాత పథకాలను పూర్తిగా ఎత్తివేసిందని, నేతన్న నేస్తం పథకాన్ని మూడు లక్షల మంది నేతన్నలకు వర్తింప చేయకుండా కేవలం 80 వేల మందికి కుదించిందని, షెడ్డు మగ్గాలు నేతన్నలకు ఉపవృత్తుల నేత పనివారికి ఈ పథకాన్ని వర్తింపజేయడంల ఏదని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో చేనేత వృత్తి మరింత సంక్షోభంలోకి వెళ్తోందని చెప్పారు. వస్త్రాల నిల్వలు పేరుకుపోయి నేతన్నలకు పని దొరకక దుర్లభమైన జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై చేనేత కార్మిక సంఘాలన్నీ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమాల బాట పట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, అధికారులకు వినతిపత్రాలతోపాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్.పరమేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, జె.వరప్రసాదరావు, ఆర్.శివసత్యనారా యణ, పి.లక్ష్మణరావు, పి.నాగేశ్వరరావు, ఆర్.పూర్ణచంద్రరావు, డి.రామారావు, కె.కోటేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, బి.మోహనరావు, బి.గిరి, డి.మల్లేశ్వరరావు, జి.వెంకటకృష్ణ, యు.దుర్గాప్రసాద్, బి.బాలేశ్వరరావు, ఆర్.నరసింహారావు, డి.ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి వినతిపత్రం
చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావును నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, రాష్ట్రంలో, దేశంలోనూ ఆకలి, చావులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేనేత శాఖామంత్రిని, సిఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ ముఖ్యమంత్రి, చేనేత మంత్రికి విషయాలను తెలిసి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ వైకె.మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జె.మణి, కో-కన్వీనర్లు పి.నాగేశ్వరరావు, ఆర్.పూర్ణచంద్రరావు, కె.కోటేశ్వరరావు, డి.రామారావు తేడేరు, ఆర్.పరమేశ్వరావు, జి.వెంకటేశ్వరరావు, మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.










