ప్రజాశక్తి-సత్తెనపల్లి, మంగళగిరి రూరల్ : చేనేత రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించి చేనేత రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యలపై కలెక్టరేట్ల వద్ద 19న నిర్వహించే ధర్నాల్లో చేనేత కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం స్థానిక ఫణిదం చేనేత సొసైటీ బిల్డింగులో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత పై జీఎస్టీని రద్దు చేయాలని, 11 రకాల రిజర్వేషన్లను ఉల్లంఘించిన పవర్ రూమ్ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేతకు రాయితీలను కొనసాగించాలని, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును, పథకాలను పునరుద్ధరించాలని కోరారు. వీటితోపాటు ఇతర సమస్యలనూ ప్రభుత్వాలు పరిష్కరించాలని లేకుంటే రానున్న ఎన్నికల్లో కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామాంజనేయులు అధ్యక్షత వహించగా ఉపాధ్యక్షులు కె.శివదుర్గారావు, సహాయ కార్యదర్శి డి.రామారావు, ఎ.వీరబ్రహ్మం, కె.వెంకటేశ్వరరావు, జి.రాజు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ధర్నా జయప్రదం కోసం మంగళగిరి మండలం ఆత్మకూరులో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులతో నిర్వహించిన సమావేశానికి బి.రాంబాబు అధ్యక్షత వహించగా డి.రామారావు, సిహెచ్.సీతారామాంజనేయులు, వి.రామారావు, సిహెచ్.జనార్దన్‌రావు, ఆనందం బాబ్జి, యు.దుర్గారావు, ఎం.శ్రీనివాసరావు, జి.లక్ష్మి, బి.సీతా మహాలక్ష్మి, ఎస్.రాధా పాల్గొన్నారు.










