Nov 02,2023 23:59

ప్రజాశక్తి - భట్టిప్రోలు
చేనేత రంగం నానాటికి దిగజారుతున్న దృష్ట్యా చేనేత పురోభివృద్ధికి, చేనేత కార్మికులంతా టీడీపీకి అండగా ఉండాలని టిడిపి బాపట్ల జిల్లా పద్మశాలి సాధికార సమితి కన్వీనర్ అవ్వారు సాంబయ్య కోరారు. మండలంలోని ఐలవరం గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను కలిశారు. చేనేతతోపాటు వివిధ రకాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న నేతన్న నేస్తం రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మందిపైగా చేనేత కార్మికులు ఉండగా కేవలం 80వేల మందికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తుందని అన్నారు. దీనివలన మిగిలిన కార్మిక కుటుంబాలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నాయని అన్నారు. చేనేత రంగం అభివృద్ధికి టిడిపి ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నదని తెలిపారు. కార్మికులంతా ఐకమత్యంగా ఉండి  టిడిపిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో చీరాల మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు విన్నకోట జగదీష్, టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పులిమిడోల శివకుమార్, జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి దీపాల ప్రసాద్, భట్టిప్రోలు క్లస్టర్ చైర్మన్ వామనపల్లి కోటేశ్వరరావు, నాయకులు యశోద కృష్ణ, మాచర్ల నాగరాజు, వంగర రమేష్ పాల్గొన్నారు.