ప్రజాశక్తి - ఏలూరు టౌన్
చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి చట్టం చేయాలని, చేనేతకు మరణ శాసనమైన జిఎస్‌టి నుంచి చేనేతను మినహాయించాలని, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక పత్తే బాధ మరక వారి వీధి సెంటర్లో ప్రపంచ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి చేనేత కార్మికులకు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ముందుగా చేనేత మగ్గం పతాకాన్ని పిచ్చుక ఆదిశేషు ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు సమావేశం సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమికను పోషించింది చేనేత రంగమే అన్నారు. 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొట్టమొదటిసారిగా స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని, విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్తాలని ధరించాలన్న నినాదంతో ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. అంతటి సుదీర్ఘమైన చరిత్ర చేనేతదని, భారతీయుల జీవితంతో పెనవేసుకుని భారతీయ సంస్కృతికి అర్థం పడుతుంది చేనేతయని వారు కొనియాడారు. చేనేత వస్త్రాలలో 95 శాతం భారత దేశంలోనే ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో చేనేత రంగంలో కోటి 30 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగాను, మరో 9 కోట్ల మంది పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నారన్నారు. భారతదేశంలో చేనేత పరిశ్రమ గణనీయమైన ఆర్థిక ప్రాధాన్యతను కలిగి ఉందని, వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగమేనన్నారు. 17, 18 శతాబ్దాల నాటికి ప్రపంచ వస్త్ర వ్యాపారంలో 25 శాతం వాటా మన దేశాని దేనని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల చేనేత రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని, చేనేత కార్మికులు ఉపాధి లేక వీధిన పడుతున్నారని ఆదిశేషు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించి చేనేత రంగాన్ని బ్రతికించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు ములకల ప్రసాద్, కుర్మా నాగేశ్వరి, కుర్మా వరలక్ష్మి, గుత్తి అచ్చయ్య, వాసా భాస్కర్, గోరు సూర్యనారాయణ, రుబ్బి రామలింగం, బలిశెట్టి వెంకటేశ్వరరావు, కనకం శ్రీనివాస్, వివిధ వృత్తిదారులు పాల్గొన్నారు.










