Oct 28,2023 01:11

సమావేశంలో నాయకులు

ప్రజాశక్తి-మంగళగిరి : చేనేత కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచాలని చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. సమావేశం శుక్రవారం రాత్రి స్థానిక సిపిఎం కార్యాలయంలో పి.నాగేశ్వరావు అధ్యక్షతన జరిగింది. సమావేశ నిర్ణయాలను చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ పి.బాలకృష్ణ వెల్లడించారు. మంగళగిరిలో చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు అసోసియేషన్‌, చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ రెండేళ్లకోసారి వేతనాలు పెంపుదలకు ఒప్పందం చేసుకుని అమలు చేస్తారని, ఆ క్రమంలో ఒప్పందం నవంబర్‌ 19 ముగిసిందని, తిరిగి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండేళ్ల నుండి నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయని, గ్యాస్‌ ధర రూ.1250కు పెరిగిందని, విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయని, ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు చాలక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనంపై 50 శాతం పెంచాలని కోరుతూ నవంబర్‌ 4వ తేదీ ఉదయం 9 గంటలకు పాత మంగళగిరి కళ్యాణ మండపం వద్ద నుండి చేనేత కార్మికుల ప్రదర్శన చేసి చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల అసోసియేషన్‌ వారికి వినతిపత్రం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. చేనేత కార్మికులు చేనేత ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏరియా చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, డి.రామారావు, తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం నాయకులు జి.ధనుంజయరావు, జెవి సుబ్బారావు, చేనేత కాంగ్రెస్‌ నాయకులు ఆర్‌.పూర్ణచంద్రరావు, బి.భాలతేడేరు, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం (ఎఐటియుసి) జిల్లా అధ్యక్షులు జి.వెంకటకృష్ణ, డి.ఈశ్వరరావు, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు కె.కోటేశ్వరరావు, ఎం.దుర్గాప్రసాద్‌, ఎస్‌.లక్ష్మయ్య పాల్గొన్నారు.