ప్రజాశక్తి-భట్టిప్రోలు: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆత్మహత్యకు పాల్పడిన సాకే గంగాధర్ కుటుంబానికి రూ.పది లక్షల సహాయం అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత సంక్షోభానికి కారణమైన నూలు, రంగులు, రసాయనాలు, చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్‌టిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత సొసైటీల్లో, మాస్టర్ వీవర్ల వద్ద నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి చేనేత కుటుంబానికి 20 శాతం రాయితీపై రెండు లక్షల ముద్ర రుణాలు అందించాలని, ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భట్టిప్రోలు సొసైటీ మాజీ అధ్యక్షులు బట్టు నాగ మల్లేశ్వరరావు, నాయకులు శ్రీనివాసరావు ఉన్నారు.










