Dec 11,2021 06:50

చెరకు ఫ్యాక్టరీలు మూతబడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. లక్షలాది చెరకు రైతులను, ఈ రంగంపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకునే ధ్యాస లేదు. సహకార రంగాన్ని బలోపేతం చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుజ్జీవం, బలోపేతంపై రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు. నిపుణుల కమిటీ, మంత్రుల కమిటీలు వేసినా రిపోర్టు బయటకు రాలేదు. లక్షలాది రైతులు, కార్మికులు ఆధారపడ్డ రంగం అయినప్పటికీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ ప్రభుత్వానికి చెరకు విధానం లేనే లేదు.

   మాజానికి తీపి పంచే చెరకు రైతు బతుకు చేదెక్కింది. లక్షలాది చెరకు రైతులు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మికుల మనుగడ ప్రమాదంలో పడింది. రెండేళ్లనాడు ఫ్యాక్టరీలకు చెరకు సరఫరా చేసిన కోట్లాది రూపాయల బకాయిల కోసం రైతులు, జీతాల కోసం కార్మికులు రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన, నాన్‌-బెయిలబుల్‌ కేసులు, ఆరెస్టుల వంటి తీవ్ర నిర్బంధాలను చవి చూడాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు స్థానిక బెల్లం మార్కెట్‌లో నెలకొంటున్న ఒడుదుడుకులు చెరకు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి 'చెరకు' సంక్షోభానికి పునాది ఎక్కడ పడింది? కారకులెవరు? రాష్ట్ర విభజన నాటికే సంక్షోభం దిశలో పయనిస్తుండగా అనంతరం అంతకంతకూ సమస్య తీవ్రమవుతూ వచ్చింది. విభజన నాటికి ఎ.పి.లో సహకార, ప్రైవేటు రంగంలో మొత్తం 29 చక్కెర ఫ్యాక్టరీలుండగా, 18 కో-ఆపరేటివ్‌, 11 ప్రైవేటు. అమ్మివేత, మూసివేత, క్రషింగ్‌ల నిలిపివేతలతో 17 కో-ఆపరేటివ్‌, ఏడు ప్రైవేటు వెరసి 24 మిల్లులు మూతబడ్డాయి. ప్రస్తుతం ఐదు మాత్రమే నడుస్తున్నాయి. నిరుడు ఎనిమిది ఫ్యాక్టరీలు నడవగా ఏడాది తిరిగేలోపు విశాఖలో ఏటికొప్పాక, తాండవ కో-ఆపరేటివ్‌ ఫ్యాక్టరీలు, విజయనగరం జిల్లాలో ప్రైవేటు రంగంలోని ఎన్‌సిఎస్‌ మూతబడ్డాయి. ఇప్పటికి నడుస్తున్న ఫ్యాక్టరీలు (1) శ్రీకాకుళం జిల్లాలో ఇ.ఐ.డి. ప్యారీ (2) విశాఖలో గోవాడ కో-ఆపరేటివ్‌ సుగర్స్‌ (3) పశ్చిమగోదావరిలో ఆంధ్రా సుగర్స్‌, తాడ్వాయి (4), కృష్ణాలో కె.సి.పి. (5), చిత్తూరులో ఎస్‌.ఎన్‌.జె. మాత్రమే. నడుస్తున్న ఫ్యాక్టరీల్లో ఒకటి కో-ఆపరేటివ్‌, కాగా నాలుగు ప్రైవేటు. సాధారణంగా మన రాష్ట్రంలో చెరకు క్రషింగ్‌ సీజన్‌ అక్టోబర్‌-ఏప్రిల్‌. 2019-20, 2020-21 సీజన్లలో కర్మాగారాలకు రైతులు సరఫరా చేసిన చెరకుకు సంబంధించి దాదాపు రూ.150 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. చిత్తూరులోని నేతమ్స్‌, మయూర, నెల్లూరులోని పొదలకూరు ప్లాంట్లు రైతులకు రూ.80 కోట్లు బకాయి పెట్టాయి. విజయనగరం జిల్లా ఎన్‌సిఎస్‌ రూ.16 కోట్లు రైతులకు ఇవ్వాలి. ఇవన్నీ ప్రైవేటు రంగంలోనివి. సహకార రంగానికి చెందిన విశాఖ జిల్లా గోవాడ ఫ్యాక్టరీ రూ.16 కోట్లు, ఏటికొప్పాకలో రైతులకు రూ.8 కోట్లు, కార్మికులకు రూ.8 కోట్లు చెల్లించాలి. తాండవ సుగర్స్‌లో రైతులకు రూ.16 కోట్లు చెల్లించాలి. 1956- సుగర్‌ యాక్టు ప్రకారం చెరకు సరఫరా చేసిన నాటి నుండి పధ్నాలుగు రోజు ల్లోపు ఫ్యాక్టరీలు రైతులకు చెల్లింపులు చేయాలి. ఆలా చేయని పక్షంలో ఆలస్యానికి వడ్డీ ఇవ్వాలి. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదు. ప్రైవేటు ప్లాంట్లు బకాయిలు పెడితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ అదుపులో ఉండే కో-ఆపరేటివ్స్‌ రైతులకు ఏళ్లకు ఏళ్లు బకాయిలు పేరబెట్టడం కంచే చేను మేసిన చందం కాదా? మొన్ననే విజయనగరం జిల్లాలో ఎన్‌సిఎస్‌లో బకాయిల కోసం రైతులు, చెరకు రైతు సంఘం నేతలు ఆందోళన చేయగా, యాజమాన్యంతో బకాయిలు ఇప్పించాల్సిన ప్రభుత్వం, తిరిగి ఆందోళనకారులపైనే కేసులకు ఒడిగట్టింది. ఈ ఒక్క ఉదంతం చాలు ప్రభుత్వం ఎవరి పక్షమో తెలుస్తుంది.
 

                                                        ఆ రాష్ట్రాల్లో కంటే తక్కువ

ఒకప్పుడు ఎ.పి.లో ఐదు లక్షల ఎకరాల్లో రైతులు చెరకు పండించేవారు. క్రమేపి విస్తీర్ణం తగ్గిపోయి ఇప్పుడు 1.20 లక్షల ఎకరాలకు చేరుకుంది. విస్తీర్ణం తగ్గడానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానమైనది గిట్టుబాటు ధర. చెరకు పండించే ఇతర రాష్ట్రాలలో కంటే మన దగ్గర టన్నుకు రూ.500 నుండి వెయ్యి వరకు తక్కువ. ఈ సీజన్‌లో కేంద్రం కనీస మద్దతు ధర రూ.2,900 ప్రకటించింది. పంజాబ్‌ రాష్ట్రం స్టేట్‌ అడ్వయిజరీ ప్రైస్‌ రూ.600 కలిపి ఇస్తోంది. అక్కడ రైతులకు రూ.3,500 లభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర రైతులకు రూ.500 సలహా ధర ఇస్తున్నాయి. కేంద్రం నిర్ణయించిన మేరకు ఎంఎస్‌పి దక్కాలంటే రికవరీ పది శాతం ఉండాలి. అధునాతన పద్ధతులు, కొత్త వంగడాల వలన యు.పి, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో రికవరీ శాతం 13 శాతం వరకు వస్తోంది. నిర్ణయించిన కనీస రికవరీ 10 శాతం కంటే ఎక్కువ వస్తే ఒక్కో శాతానికి అదనపు ధర వస్తుంది. ఆ మేరకు ఆయా రాష్ట్రాలలో చెరకు రైతులు మన కంటే ఎక్కువ ధర పొందుతున్నారు. మన రాష్ట్రంలో వంగడాల అభివృద్ధి లేకపోవడం వలన, చెరకు పరిశోధనలపై ప్రభుత్వాలు దృష్టి సారించని కారణంగా సగటు రికవరీ 9.5 శాతం వద్దనే కునారిల్లుతోంది. రైతులు ఎం.ఎస్‌.పి కంటే ధర కోల్పోతున్నారు. మన రాష్ట్రంలో 2002 ప్రాంతంలో సలహా ధరను ఎత్తేశారు. ఫ్యాక్టరీలు సర్కారుకు టన్నుపై కట్టాల్సిన రూ.60 కొనుగోలు పన్నును రైతులకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. సలహా ధర రూ.300 ఉండగా దాన్ని తొలగించి రూ.60 ఇస్తున్నారు. అప్పటి నుండి ఇదే విధానం కొనసాగుతోంది. జి.ఎస్‌.టి వచ్చాక అదీ లేదు. గిట్టుబాటు కాకపోవడంతో రైతులు చెరకు నుండి వేరే పంటలకు మళ్లుతున్నారు. చెరకు సంవత్సరకాలం పంట. టన్ను చెరకు నరికి ఫ్యాక్టరీకి తోలడానికి రూ.వెయ్యి నుండి 1,200 రైతుకు ఖర్చవుతుంది. పంట పండించడానికి పెట్టుబడులవుతాయి. ఇంతా చేస్తే సమయానికి చెల్లింపులు చేయకుండా ఫ్యాక్టరీలు బకాయిలు పెట్టడం చెరకు నుండి రైతులు దూరం జరగడానికి మరో కారణం. ఫ్యాక్టరీలు మాత్రం చక్కెరను, మొలాసిస్‌ను, పిప్పిని సైతం అమ్ముకుంటున్నాయి. రైతులకు సున్నం పెడుతున్నాయి. రాష్ట్రంలోని ఫ్యాక్టరీలు వాటి సామర్ధ్యానికి తగ్గట్లు ఆడాలంటే ఈ విస్తీర్ణం సరిపోదు. ఏ మిల్లు అయినా 150 రోజులు ఆడితేనే నిలబడుతుంది. కనీసం వంద రోజుల క్రషింగ్‌కు 12 లక్షల టన్నుల చెరకు కావాలి. చెరకు లేనందున ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి.
 

                                                    బెల్లానికి దిగుమతుల సెగ

ఉత్తరాంధ్ర, చిత్తూరు, కొంత వరకు గోదావరి జిల్లాల్లో పండే చెరకులో దాదాపు 30 శాతం బెల్లం తయారీకి వినియోగమవుతోంది. దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్లలో అనకాపల్లి ఒకటి. కాని ధర తక్కువ, ఆర్గానిక్‌ వంటి పేర్లతో మహారాష్ట్ర, కర్నాటక, తదితర రాష్ట్రాల నుండి బెల్లం దిగుమతులొచ్చి పడుతున్నాయి. ఇక్కడి నుండి బయటికి ఎగుమతులు తగ్గాయి. ఇ-మార్కెట్‌ వచ్చాక స్థానిక మార్కెట్‌లో స్తబ్దత నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిడిడి) రాష్ట్రంలో అతి పెద్ద బెల్లం వినియోగదారు. ప్రస్తుతం అనకాపల్లి నుండి కాకుండా బయటి రాష్ట్రాల నుండి బెల్లం కొంటున్నది. టిటిడి నుండి బెల్లాన్ని కొనుగోలు చేయించి స్థానిక రైతులను, పరిశ్రమను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గమ్మునుంది.
 

                                                               విధానం లేదు

రాష్ట్రంలో చెరకు సంక్షోభం నుండి బయట పడాలంటే పంట విస్తీర్ణం పెరగాలి. అందుకు ప్రభుత్వం నుండి రైతులకు ప్రోత్సాహకాలు పెరగాలి. సకాలంలో ఎప్పటికప్పుడు రైతులకు ఫ్యాక్టరీల నుండి పేమెంట్లు జరగాలి. రికవరీ శాతం పెంచేందుకు కొత్త వెరైటీల కోసం పరిశోధనలు జరగాలి. చెరకు ఉప ఉత్పత్తులైన మొలాసిస్‌, ఇథనాల్‌, ఇతర బయోమాస్‌ ప్రొడక్ట్స్‌ను తయారు చేయాలి. పురాతన చక్కెర మిల్లులను ఆధునీకరించాలి. చెరకు ఫ్యాక్టరీలు మూతబడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. లక్షలాది చెరకు రైతులను, ఈ రంగంపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకునే ధ్యాస లేదు. సహకార రంగాన్ని బలోపేతం చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుజ్జీవం, బలోపేతంపై రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు. నిపుణుల కమిటీ, మంత్రుల కమిటీలు వేసినా రిపోర్టు బయటకు రాలేదు. లక్షలాది రైతులు, కార్మికులు ఆధారపడ్డ రంగం అయినప్పటికీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ ప్రభుత్వానికి చెరకు విధానం లేనే లేదు. జాతీయ స్థాయిలో అధికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల విధానం చెరకు సమస్యకు హేతువులుగా ఉన్నాయి. చెరకుపై ప్రభుత్వ అలసత్వానికి సమయం మించిపోయింది. స్పందించకుంటే ఆ రంగం అంతర్ధానం అవుతుంది. రైతులు, కార్మికులు పాలకులను కదిలించాల్సిన సమయం ఆసన్నమైంది.

/ వ్యాసకర్త సెల్‌ : 9490099019 /

కె.ఎస్‌.వి. ప్రసాద్‌