ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ప్రపంచ మానవాళి విముక్తి కోసం భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ఆఖరి క్షణం వరకూ పోరాడిన ధీరుడు, కోట్లాది మంది యువత గుండెల్లో నిలిచిన గెరిల్లా యోధుడు చే గువేరా అని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, డివైఎఫ్‌ఐ మండల నాయకులు టి శ్రీను, పి శేషగిరి అన్నారు, బుధవారం చేగువేరా 95వ జయంతి వేడుకలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాజవొమ్మంగిలో ఘనంగా నిర్వహించారు. ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డివైఎఫ్‌ఐ నాయకులు చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు బీజేపీ మతోన్మాద శక్తులను అంతం చేయడానికి చే గువేరాను ఆదర్శం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు పాండవుల సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు జర్తా రాజు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు : చే గువేరా నేటితరానికి ఉద్యమస్ఫూర్తి, పోరాటదీప్తి అని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ, ఎఐఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు అన్నారు. బుధవారం పాడేరులో చే గువేరా 95వ జయంతి పురస్కరించుకొని ఎపి గిరిజన సమాఖ్య, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాటిన్ అమెరికాలో బైక్‌పై తిరుగుతూ, అక్కడి సమస్యలను అధ్యయనం చేసి, మహత్తర ఉద్యమాన్ని చే గువేరా నిర్మించారన్నారు. చే గువేరా పేరు వినిపిస్తే నరనరాల్లో చైతన్యం ప్రవహిస్తుందని, . దేహం నిలువల్లా నిప్పురవ్వ లా వెలిగి పోతుందన్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన డైనమిక్ లీడర్ చేగువేరా అని ప్రశంసించారు. కార్యక్రమంలో గిరిజన సమాఖ్య నాయకులు చంటిబాబు, మహేష్ సురేషు పాల్గొన్నారు.










