Jul 26,2022 23:40

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిఐ రామచంద్రరావు

ప్రజాశక్తి -ఆనందపురం : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆనందపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రామచంద్రరావు పేర్కొన్నారు. గిడిజాలలోని సాయి గణపతి కళాశాలలో యువతకు చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, విద్యార్థి దశ ఎంతో కీలకమన్నారు. ఈ దశలో సక్రమమైన మార్గంలో వెళ్లగలిగితే భవిష్యత్తు బంగారమయంగా ఉంటుందన్నారు. చెడు వ్యసనాలకు లోనైతే జీవితరం అంధకారంలో పడిపోతుందని తెలిపారు. ర్యాగింగ్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు అతివేగం పనికిరాదని, దీని వల్ల పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు విద్యాభ్యాసాలు అందిస్తుంటే.. నేటి యువత క్షణికావేశంలో అనేక అనర్ధాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చిన్నపాటి సమస్యలకే మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంచి లక్ష్యంతో విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ వేణుగోపాల్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మహేశ్వరరావు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రదీప్‌ వర్మ, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను, గిడిజాల సర్పంచ్‌ షినగం అప్పలరాజు పాల్గొన్నారు.