Jun 24,2023 22:09

ప్రజాశక్తి-జగ్గంపేట చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జగ్గంపేట సిఐ సూర్య అప్పారావు విద్యార్థులకు సూచించారు. స్థానిక అక్షర డిగ్రీ కళాశాలలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ యువత గంజాయి, మద్యం, సిగరెట్లు వంటి మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి అ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ వ్యసనాల వల్ల యువత విద్యార్థి దశలో ఉరకలెత్తాల్సిన వయసులో శక్తి నిర్వీర్యమవుతుందన్నారు. ఆలోచన సన్నగిల్లుతుందన్నారు. చదువుకోవాలన్న ధ్యాస తగ్గిపోవడంతో పాటు చేస్తున్న పనిపై ఏకాగ్రత తప్పుతుందన్నారు. కుటుంబ బాంధవ్యాలు దూరమవుతాయన్నారు. డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల బారిన పడిన వారి అవస్థలు. తెలిసి తెలియకో, స్నేహితుల ఒత్తిడి మేరకో ఒకసారి తీసుకుంటే మత్తుకు అలవాటై చివరకు బానిసవుతున్నారు. మత్తు నుంచి బయటపడలేక నిండుజీవితాన్ని బలి చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో సరఫరా, విక్రయం, వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల్లో ఎవరికైనా పోలీస్‌ అవ్వాలని ఆసక్తి ఉన్నవారికి చదువుకునేందుకు స్టడీ మెటీరియల్‌ ఉచితంగా అందజేస్తానని సిఐ హామీ ఇచ్చారు. ఎస్‌ఐ సిహెచ్‌.విద్యాసాగర్‌ మాట్లాడుతూ గంజాయి, కొకైన వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా టోల్‌ఫ్రీ నెంబర్‌ 14500కు లేదా 9440796569 నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మోటార్‌ సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర కళాశాల ప్రిన్సిపల్‌ ఆళ్ల రవి కిషోర్‌, ఆళ్ల శ్రీనివాస్‌ కిరణ్‌, వెంకటేశ్వరరావు, కాలేజీ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.