కడప సిటీ : విద్యార్థి దశనుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. నగరంలోని జాలాజీనగర్‌లోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో 'యాంటిడ్రగ్స్'పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ చదువుకున్న వారికి డ్రగ్స్ ఉపయోగించడం వల్ల వచ్చే నష్టాలు తెలియడం వల్ల మిగిలిన వారిలో కూడా అవగాహన కల్పించడం చాలా సులభం అవుతుందని చెప్పారు. సమాజ మార్పులో మహిళల పాత్ర చాలా ముఖ్యమని గుర్తు చేశారు. నార్కోటిక్స్ కేసులో దొరికిన నిందితులకు బెయిల్ కూడా దొరకదని, శిక్షలు కఠినంగా ఉంటాయని తెలియజేశారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను సాధించడంలో కావాల్సిన సహకరాన్ని ప్రతి విద్యార్థి అందజేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆలోచనలు గొప్పగా ఉంటాయని, వాటిని ఆచరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పారు. విద్యార్థి దశంలో ప్రతి ఒక్కటీ కొత్తగా ఉంటుందని, ఆ దశలోనే డ్రగ్స్‌కు బానిసయ్యే మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. వీర సుదర్శన రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని, తమ కళాశాల పిల్లలు డ్రగ్స్‌కు దూరంగా ఉంటారని, ఒకవేళ డ్రగ్ సంబంధించిన విషయాలు తమ కళాశాల విద్యార్థులకు తెలిస్తే దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తారని మాట ఇచ్చారు. కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించినందునకు యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలిపారు.










