శరత్ బాబు మృతికి కళా సంఘాల సంతాపం
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్
చెదరని చిరునవ్వు, మృదువుగా కొత్తవారినైనా ప్రోత్సహించే గుణం కలిగిన నటులలో చలనచిత్ర సీమలోని అతి కొద్ది మందిలో శరత్‌బాబు ఒకరని, అటువంటి మహానటుడు శరత్ బాబు మరణం తీరని లోటుని వర్థమాన సినీ దర్శకులు కెబి ఆనంద్ అన్నారు. మంగళవారం సినీ హీరో శరత్‌బాబు మృతిపై సకల కళా సమాఖ్య, సామర్లకోట-పెద్దాపురం ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లు తీవ్ర సంతాపాన్ని తెలిపాయి. ఈ సందర్భంగా దర్శకులు ఆనంద్ మాట్లాడుతూ తాను ప్రముఖ దర్శకులు ఆర్.నారాయణమూర్తి శిష్యుడిగా అన్ని చిత్రాలకు సహ దర్శకులుగా పనిచేశానన్నారు. మొట్టమొదటి సారిగా తాను స్వీయ దర్శకత్వంలో చిత్రీకరించిన రెండేళ్ల తర్వాత చిత్రంలో ప్రధాని పాత్ర పోషించిన శరత్‌బాబు తనను ఎంతగానో ప్రోత్సహించి సకాలంలో చిత్రం పూర్తయ్యేందుకు ఎంతగానో సహకరించారన్నాని ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సమాఖ్య నాయకులు బడుగు సీతారామరాజు, డి రాజు, ఆలమండ ప్రసాద్, న్యాయ సలహాదారులు కోర్లమండ వీరభద్ర రావు, ఆర్కెస్ట్రా అసోసియేషన్ నాయకులు గిడుతూరి శ్రీనివాసరావు, బొడ్డు రామారావు, వర్దనపు శ్రీనుబాబు, మధు, ప్రసాద్, అల్లం ఏడుకొండలు, వీరబాబు, వెంకన్న, రాజు, అనంత ఉన్నారు.










