May 21,2023 20:24

ప్రతిభ కనబరిచిన తస్లీమాకు నగదు అందజేస్తున్న అప్సర్‌ బాష

ప్రజాశక్తి - ఆదోని
చదువుతోపాటు చిన్నారులకు వ్యాయామం తప్పనిసరిగా ఉన్నప్పుడే శరీరం దృఢంగా తయారై ఆరోగ్యంగా ఉంటారని కెఎన్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నటరాజ్‌ స్వామి, వ్యాపారవేత్త, టిడిపి మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు అప్సర్‌ బాష తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో కళాభారత్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న చిన్నారులకు పలు రకాల మెటీరియల్‌ అందజేశారు. అంతకుముందు తస్లీమా అనే విద్యార్థిని యోగా, కరాటేలో పలు ఆసనాలు, భంగిమలు ప్రదర్శించారు. చిన్నారి చూపిన ప్రతిభను మెచ్చుకున్న దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కళాభారత్‌ సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 ఏళ్లుగా యువత ఆత్మరక్షణ కోసం యోగా, కరాటే, బాక్సింగ్‌, కర్రసాము వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. పాఠశాల ప్రాంగణంలో వేసవిలో స్కూల్‌ విద్యార్థులకు శరీర దృఢత్వం కోసం శిబిరం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు. తమవంతుగా కెఎన్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, దేశాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.20 వేల విలువ చేసే క్రీడా పరికరాలను విరాళంగా అందజేశారని చెప్పారు. భవిష్యత్తులో కళాభారత్‌ సేవా సమితి వారికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం దాతలకు కళాభారత్‌ సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. దేశాయి ఫౌండేషన్‌ పవన్‌ భార్గవ్‌ దేశాయి, విశ్రాంత ఉపాధ్యాయులు దేవప్రసాద్‌, అల్లు అర్జున్‌, పట్టణ అధ్యక్షులు చంద్ర రాయల్‌, శిక్షకులు కేశవ, మాస్టర్‌ కుమార్‌ గౌడ ఉన్నారు.