ప్రజాశక్తి-పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా ఫలాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా చదువు కోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చదువుకుంటేనే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బుధవారం ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా. కురుపాం నుండి జగనన్న అమ్మఒడి నిధుల విడుదలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు భాగ్యలక్ష్మిలు అమ్మ ఒడి ప్రత్యక్ష ప్రసారాన్ని స్థానిక కాఫీ హౌస్ నుండి తిలకించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లక్ష 1 వెయ్యి 170 మంది విద్యార్థులకు రూ.151 కోట్ల 75 లక్షల 50వేలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకుని, చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులు బయట ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలని స్పష్టం చేసారు. ఏజెన్సీ నుండి బయటకు వెళితే పోటీ ప్రపంచంపై అవగాహన వస్తుందన్నారు. జిల్లాలో 5.50 లక్షల మహిళా పాపులేషన్ ఉందని, మహిళల చదువుతో సమాజం రూపు రేఖలు మారి పోతాయన్నారు. ఉపాధ్యాయులు బాధత్యగా నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పడాలన్నారు.
పాడేరు శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చిందన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. విద్యా రంగానికి రూ.52 వేల కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించారని పేర్కొన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, టై విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు విద్యాదీవెన, వసతి దీవెన ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
అరకు శాసన సభ్యులు వెట్టి పొల్గుణ మాట్లాడుతూ పేద విద్యార్థులను ఉన్నతంగా చదివించే బాధ్యతలు ముఖ్యమంత్రి జగనన్న చేపట్టారని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న విద్యా, వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. పిల్లలను పాఠశాలలకు పంపించే బాధ్యత తలిదండ్రులపైనే ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి సలీం భాషా, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకలు ఐ. కొండలరావు, పాడేరు ఎంపిపి ఎస్. రత్నకుమారి, కొయ్యూరు ఎంపిపి బడుగు రమేష్ బాబు, జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.










