ప్రజాశక్తి-కూనవరం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే చదువు చాలా కీలకమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షులు కుంజా రాధ అన్నారు. స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఐద్వా, యుటిఎఫ్ ఆధ్వర్యాన సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆదివారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కుంజా రాధ మాట్లాడుతూ చదువు వల్ల ప్రాధాన్యత, సావిత్రిబాయి పూలే మహిళలకు, బాలికలకు చదువు కోసం బడులు తెరిపించిన విధానం గురించి తెలియజేశారు. మహిళల మీద జరుగుతున్న దాడులు, హింస, అత్యాచారాలు, హత్యలు, వేధింపులు నిర్మూలించే విధంగా మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న బాల్యవివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీ పురుషులు సమానమని, కులమత భేదాలు లేవని, అందరం ఒక్కటేనని పేర్కొన్నారు. మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐద్వా ఎన్నో పోరాటాలు చేసి నిర్భయ చట్టం, దిశా చట్టం, పోక్స్ చట్టం వంటి ఎన్నో చట్టాలను సాధించినట్లు చెప్పారు. అయితే వాటిని అమలుపరిచే విధానంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నేరం చేసిన వారికి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.










