ప్రజాశక్తి - ఆరిలోవ : చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని రిటైర్డ్ ఎస్‌పి టిఎస్‌ఆర్ ప్రసాద్ అన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఆరిలోవ సిఐ సోమశేఖర్ ఆధ్వర్యాన తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. టిఎస్‌ఆర్.ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులను క్రీడలవైపు దృష్టి మళ్లించేందుకు ఈ వేసవి శిక్షణా శిబిరాలు ఎంతో దోహదపడతాయన్నారు. ద్వారకా ఎసిపి ఆర్‌విఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ, క్రీడలతో శారీర దారుఢ్యంతో పాటు మానసికారోగ్యం కలుగుతుందన్నారు. ఆరిలోవ సిఐ సోమశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా సామగ్రిని, దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సూర్యనారాయణ, అనీల్ కుమార్, కోచ్‌లు సూరిబాబు, రామకృష్ణ, మీనా, వర్మ, సుమన్, జాన్ తదితరులు పాల్గొన్నారు.










