ప్రజాశక్తి - రంపచోడవరం
ఏజెన్సీలోని విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు కూడా నేర్పించే బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే అన్నారు. బుధవారం మండలంలోని ముసురుమిల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో రంపచోడవరం నియోజకవర్గస్థాయి ఆటల పోటీలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లోని పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. 9, 10 తేదీల్లో వాలీబాల్, కబాడీ, ఖోఖో, విలువిద్య, హ్యాండ్ బాల్, సెటిల్ బ్యాడింటెన్ తదితర ఆటల్లో నెగ్గిన క్రీడాకారులతో డివిజన్ స్థాయిలో ఆడతారని చెప్పారు. అక్కడ ప్రతిభ కనబర్చిన వారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆటల పోటీలకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 11 మండలాలలోని 56 స్కూళ్లకు చెందిన 800 మంది బాలబాలికలను ఈ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలకు హాజరైనట్లు తెలిపారు. వీరికి భోజన, వసతి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.శ్రీనివాసరావు, ఏటిడబ్ల్యూఓ రామ తులసి, మండల విద్యాశాఖ అధికారి కెవివి.సత్యనారాయణ దొర, ప్రధానోపాధ్యాయులు కెఆర్‌పి కుమార్, స్కూల్ గేమ్స్ సహాయ కార్యదర్శి, ఎం.సృజన దొర, ఫిజికల్ డైరెక్టర్లు కె. తిరుపతిరావు, కె. పోతురాజు, మంగయమ్మ, నాగిరెడ్డి, మురళి, రామయ్యమ్మ, వార్డెన్లు వెంకన్న దొర, రాజారావు తదితరులు పాల్గొన్నారు.










