- ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: పదవ తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయాలని,చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రధానోపాధ్యాయులను కోరారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో మొగల్‌రాజపురంలోని సిద్దార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయలు మండల విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేది నుండి 18వ తేది వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిందరన్నారు. జిల్లా వ్యాప్తంగా 30,134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఉన్న 15 రోజులు వ్యవది ఎంతో కీలకమైనదన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి అర్థమయ్యే రీతిలో బోదించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్దం చేయాలన్నారు. పరీక్ష లకు హాజరయ్యే పద్దతి, ప్రశ్నకు సంబంధించి జవాబు వ్రాసే విధానం వంటి విషయాలను విద్యార్థులకు సూచించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒత్తిడిని తట్టుకుని పరీక్షలను ప్రశాంతంగా వ్రాసేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గత పరీక్షల మాధిరిగా కాకుండా ఈ ఏడాది కేవలం ఆరు పేపర్లను మాత్రమే విద్యార్థులు వ్రాయవలసి ఉంటుందన్నారు. పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నుండి మూడు రోజులు వ్యవది ఉన్నందున రాయాల్సిన ఆ సబ్జెక్టుపై విద్యార్థులకు విశధీకరించేలా ప్రత్యేక దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధించగలుగుతారన్నారు. నూరు శాతం ఫలితాలను సాధించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. పరీక్షల ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్ద చదువుకుని పరీక్షలకు హాజరు అవుతారనే ఉద్దేశాన్ని విడనాడి పాఠశాలలోనే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు పరీక్షలు పూర్తి అయ్యేవరకు ఏ ఒక్క రోజు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో పాటు మిగిలిన తరగతుల విద్యార్థులపై కూడా ఆదే శ్రద్ద కనపరచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కిశోరాబాలికలలో రక్త హీనతను నివారించేందుకు సరఫరా చేస్తున్న ఐరన్ ట్యాబ్‌లెట్లను తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు. సమావేశంలో డిఇవో సివి రేణుక, స్కూల్ ఇన్‌స్పెక్టర్ కొండ. రవికుమార్, డిప్యూటి డిఇవో గౌరిశంకర్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమీషనర్ కె.వి.ఎన్. కుమార్, డిసిఇబి సెక్రటరీ ఉమర్ అలీ ఇతర అధికారులు పాల్గొన్నారు.










