Aug 05,2021 10:53

భోపాల్‌ : ఇటీవల విడుదలైన సిబిఎస్‌ఇ పదవ తరగతి ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వాణిషా పాతక్‌ ప్రతిభ కనబర్చారు. కానీ సంతోషించేందుకు తన తల్లిదండ్రులు జితేంద్ర కుమార్‌, డా. సీమా పాతక్‌ ఇప్పుడు లేరని కన్నీరుమున్నీరు ఆవుతున్నారు ఈ 16 ఏళ్ల బాలిక. కోవిడ్‌తో ఈ మే నెలలో తన తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయారు. ఇటీవల విడుదలైన సిబిఎస్‌ఇ 10వ తరగతి ఫలితాల్లో ఇంగ్లీష్‌, సంస్కృతం, సైన్స్‌, సోషల్‌ల్లో 100కి 100 రాగా, లెక్కల్లో 97 మార్కులు వచ్చాయి. ఒకప్పుడు తన తల్లిదండ్రులతో కళకళలాడిన ఇళ్లు... వారి మరణంతో బోసిపోయిందని వాణిషా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు మిగిలింది తన 10 ఏళ్ల తమ్ముడు మాత్రమే అంటున్నారు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారన్న ఆమె... ప్రస్తుతం తన ప్రేరణకు మిగిలింది తన సోదరుడేనని చెప్పారు. తన కోసమే ఏదో ఒకటి చేయాలని తపన పడుతోంది ఈ చిన్నది.
ఈ సందర్భంగా తన తల్లితండ్రులు చెప్పిన చివరి మాటలను నెమరేసుకున్నారు. 'నిన్ను నువ్వు నమ్ముకో... మేం తిరిగి వస్తాం' అని అమ్మ చెప్పగా.. 'ధైర్యంగా ఉండమ్మా' అని నాన్న చెప్పారని గుర్తు చేసుకున్నారు. వాణిషా తండ్రి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ కాగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వారిని చివరి సారిగా ఆసుపత్రికి వెళుతుండగా సజీవంగా చూశానని వాణిషా అన్నారు. ఆ తర్వాత మరణ వార్త మమ్మల్ని కుంగదీసిందని తెలిపారు. ఆ తర్వాత వాస్తవాన్ని గ్రహించి చదువుపై దృష్టి సారించానని అన్నారు. తన తండ్రి తనను ఐఐటిలో చదవాలని, లేదా సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాన్ని సంపాదించి... దేశానికి సేవ చేయాలని భావించారని చెప్పారు. తన తండ్రి కల ఇప్పుడు... తన కలగా మార్చుకున్నానని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వారి మేనమామ పరిరక్షణలో ఉన్నారు.