ప్రజాశక్తి - క్రోసూరు : యువత చదువుకు తగ్గట్టుగా ఉద్యోగావకాశాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని భారత ప్రజాతంత్ర యువజన సఘం (డివైఎఫ్‌ఐ) జిల్లా నాయకులు టి.ఉదరు భాస్కర్ అన్నారు. మండలంలోని దొడ్లేరులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కానిస్టేబుల్స్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ పోరాటం చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులూ నిరీక్షిస్తున్న క్రమంలో సత్వరమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయడంతోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ అంశంపై పోరాటాల్లో నిరుద్యోగులు, యువత కలిసి రావాలని కోరారు. విద్యార్థులు, యువతను పెడదోవ పట్టిస్తున్న, నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ అంతం కోసం డివైఎఫ్‌ఐ పోరాడుతోందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను చైతన్య చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతోందని తెలిపారు. అనంతరం డివైఎఫ్‌ఐ గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కోటేశ్వరరావు, కార్యదర్శిగా మనీమనోజ్‌శాస్త్రి, సభ్యులు ఎన్నికయ్యారు. గోపి, కుమార్ పాల్గొన్నారు.










