ప్రజాశక్తి - పాలకొండ : బడి ఈడు పిల్లలు ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. పాలకొండ పట్టణం పెద్ద కాపు వీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు బడి ఈడు పిల్లలను పాఠశాలలో ఎంత మందికి చేర్పించింది, డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాలకొండ పరిధిలో సుమారు 176 మంది బడికి బయట ఉన్న పిల్లలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు ఉన్నారని, అటువంటి వారిని గుర్తించి బడిలో చేరేలా చర్యలు తీసుకున్నామని ఎన్‌రోల్‌మెంట్ ప్రత్యేక అధికారి అర్.విజయకుమారి కలెక్టర్‌కు వివరించారు. బడిలో డ్రాప్ అవుట్స్, వలసలతో దూరమైనందుకు గల కారణాలను, పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు బడి ఈడు పిల్లలు బడికి చదువుకు దూరం కాకూడదన్న ఉన్నతమైన ఆశయంతో ప్రభుత్వం అమ్మఒడి వంటి పథకాలను అమలు చేస్తూ పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాధ్యత వహిస్తుందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను సమర్ధవంతంగా నిర్వహించి బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క బడి ఈడు పిల్లడు తప్పకుండా వారం రోజుల్లోగా శత శాతం నమోదయ్యేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. పిల్లల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు బృంద చర్చలు, పాఠ్యాంశాల పై పట్టుసాధించేదుకు బహిరంగంగా వెలువరించే అవకాశం కల్పించాలని, తద్వారా లోపాలను సరిదిద్ద వచ్చని అన్నారు. అనంతరం నాడు నేడు రెండో విడత కింద మంజూరైన పాఠశాల అదనపు తరగతుల భవన నిర్మాణాలను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పనుల పురోగతిని పరిశీలించి అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఇఒ ఎన్.ప్రేమకుమార్, ఎంఇఒలు పి.కృష్ణమూర్తి, సిహెచ్.సోంబాబు, ఉపతహశీల్దార్ వి.బుచ్చయ్య, ప్రధానోపాధ్యాయుడు సిహెచ్.సోమేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.










