ప్రజాశక్తి - కాకినాడ
చదువును మధ్యలోనే ఆపేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్చేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనులు, నాడు-నేడు పనులు, సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలపై కలెక్టర్ కృతికాశుక్లా వీడియో కాన్ఫరెన్స్ న్విహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో డ్రాపౌట్లను గుర్తించి వెంటనే పాఠశాలల్లో తిరిగి జాయిన్ చేయాలన్నారు. ఇందుకు మండల స్థాయి విద్యాధికారులు సచివాలయం, వాలంటీర్లతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. వాలంటీర్ల గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వే సక్రమంగా నిర్వహించి డ్రాపౌట్స్ వివరాలు యాప్‌లో నమోదు చేయాలన్నారు. నాడు-నేడు పనులకు సంబంధించి మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా ఇఆర్‌ఒలు సంక్షిప్త ఓటరు సవరణ జాబితా-2024 తనిఖీ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ శాశ్వత భవనాల పనులు వేగవంతం చేయాలన్నారు. సచివాలయం, ఆర్‌బికె భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
కెరీర్ మాడ్యూల్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందిచిన కెరీర్ మాడ్యూల్‌ను కలెక్టర్ కృతికాశుక్లా సోమవారం స్పందన హాల్లో ఆవిష్కరించారు. భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇఒ కెఎన్‌విఎస్.అన్నపూర్ణ, స్టేట్ రిసోర్స్ పర్సన్ జివివి.సత్యనారాయణ, రైజ్ కన్వీనర్ జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










