ప్రజాశక్తి - ఏలూరు టౌన్
చదరంగం భావి జీవిత అభ్యున్నతికి సామాజిక సమయస్ఫూర్తిని అందిస్తుందని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఆళ్ల నాని అన్నారు. ఏలూరు 43వ డివిజన్‌కు చెందిన పచ్చల సుకుమార్, విజయలక్ష్మి దంపతుల పెద్దకుమార్తె పచ్చల సుచిత్ర క్రిస్టీ (8వ తరగతి), చిన్న కుమార్తె పచ్చల బబ్లీబాల (7వ తరగతి) చదరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటారు. చిన్నవయస్సులోనే ప్రత్యర్థులకు అంతుచిక్కని రీతిలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అనేక విజయాలు సాధించారు. సుచిత్ర క్రిస్టీ జిల్లాస్థాయిలో ఏడుసార్లు ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయిలో పలుమార్లు టాప్ 10 లో నిలిచింది. బబ్లీబాల జిల్లాస్థాయిలో మూడుసార్లు ప్రథమ స్థానం సాధించింది. క్రిస్టీ జాతీయస్థాయి పోటీలకు, బబ్లీబాల రాష్ట్రస్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ ఏడాది మే 15న ఎంఎల్‌ఎ ఆళ్ల నాని గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్‌కు వచ్చినక సందర్భంలో వారు సాధించిన పతకాలు, ప్రశంసాపత్రాలను ఆళ్ల నానికి చూపించి జాతీయ స్థాయిలో పోటీలకు సన్నద్ధమవ్వాలనే తమ ఆకాంక్షలను ఆయనకు తెలిపారు. చదరంగం శిక్షణ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నదని, తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనందించాలని తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు స్పందించిన నాని వారికి చదరంగం శిక్షణ నిమిత్తం లక్ష రూపాయలు అందజేశారు. వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ క్రమంలో పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆళ్ల నాని తరపున డాక్టర్ దిరిశాల వరప్రసాద్, జిల్లా పరిషత్ ఛైర్మన్ గంటా పద్మశ్రీప్రసాద్, డిప్యూటీ మేయర్ సుధీర్‌బాబు, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పలువురు కార్పొరేటర్ల ద్వారా ఆ బాలికలకు లక్ష రూపాయల నగదును అందజేశారు. తమ బిడ్డల ప్రతిభను గుర్తించి చేయూతనందించిన ఎంఎల్‌ఎకు కృతజ్ఞతలు తెలిపారు










