నూతన ఆర్థిక విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు...రేషన్ అక్రమ రవాణాని సాకుగా చూయించి ...వస్తువుల సరఫరాకి బదులుగా నగదు బదిలీ చేయటానికి పూనుకునే అవకాశం ఉంది. సబ్సిడీకి బదులు నగదు బదిలీ మొదలైన తరువాత వంట గ్యాస్ సబ్సిడీ మాదిరిగానే చిన్నగా తగ్గించి ప్రజలకు రేషన్ అందించే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకుంటుంది.
మన రాష్ట్రంలో దాదాపు ఒక కోటి 48 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అందులో ప్రతీ నెల 90 శాతానికి పైగా ప్రజలు చౌక ధరల దుకాణాలలో పౌర సరఫరాల శాఖ బియ్యాన్ని తీసుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సరాసరి ఒక కార్డులో ముగ్గురు సభ్యులు ఉన్నారనుకున్నా నెలకు దాదాపు 20 కోట్ల కేజీల బియ్యాన్ని ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నది. ఈ బియ్యాన్ని కేజీ 1 రూపాయికి అందిస్తున్నది. రేషన్ కార్డు ద్వారా అందే పౌర సరఫరాల వల్ల పేదల ఆకలి తీరుతోంది. ఇది ఒక కోణం అయితే రెండో కోణం ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం చుట్టూ బిగుసుకుపోయిన మాఫియా.
రాష్ట్రంలో 20 వేల చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా ప్రజలు ప్రతి నెలా బియ్యం ఒక రూపాయి ధరకే కొనుక్కుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో ప్రజలు 10 రూపాయలకు (కొంచెం అటు ఇటుగా) ఆ రేషన్ డీలర్‌కే అమ్ముతున్నారు. అలా రేషన్ డీలర్లు కొన్న బియ్యాన్ని 2 నుండి 3 రూపాయల లాభం చూసుకొని రేషన్ మాఫియాకి అమ్ముతున్నారు. అలాగే కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఇళ్లెంట తిరిగి ప్రజల దగ్గర బియ్యాన్ని కొని రేషన్ మాఫియా వారికి అమ్ముతున్నారు. ఇది నిత్య ప్రక్రియ. 'అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నాం' అంటూ అధికారులు అరకొర సరుకు పట్టుకోవటం....దొరికిన వారి మీద కేసులు నమోదు చేసి కోర్టులలో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండడం...చివరికి ఆధారాలు లేవని కేసులు కొట్టివేయటం అనే పెద్ద రసవత్తర నాటకం జరుగుతోంది. ఇవి పౌర సరఫరాల శాఖ బియ్యమే అని నిరూపించటంలో సాంకేతిక సమస్య కూడా వుంది. 'పోలీసుల కంటే ఈ మాఫియా వారే తెలివైనవారు. ఎందుకంటే అక్రమ రవాణా రోజురోజుకి పెరిగిపోతోంది గనుక' అన్నాడో మిత్రుడు వ్యంగ్యంగా. దీన్నిబట్టి పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు.
ఇలా కొన్న బియ్యాన్ని దళారులు లారీలు, వ్యానుల ద్వారా అనేక ప్రాంతాలకు పంపిస్తుంటారు. దళారులు 13 నుండి 14 రూపాయలకు కొన్న బియ్యాన్ని 23 నుండి 25 రూపాయల వరకు పైవ్యాపారులకు అమ్ముకుంటారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఈ బియ్యం బహిరంగ మార్కెట్లలో 40 నుండి 50 రూపాయల ధర పలుకుతుంది. ఈ బియ్యాన్ని ఆల్కహాల్ తయారీకి, శానిటైజర్ తయారీకి అలాగే పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతుంటారు. కొంత సరుకు తిరిగి పౌర సరఫరాల శాఖ ద్వారా మళ్ళీ రేషన్ షాపులకు కూడా చేరుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ బియ్యానికి 100 నుండి 130 రూపాయల వరకు ధర పలుకుతుందని ఓ జాతీయ పత్రిక ప్రచురించింది మరి. దక్షిణాసియా దేశాలైన ఇండొనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలలో ఈ బియ్యం మంచి ధర పలుకుతుంది.
ప్రజా ధనం ఇలా పక్కదోవ పట్టటానికి కారణం ప్రభుత్వ నిఘా సరిగా లేకపోవటమా? లేక దళారులు చాకచక్యంగా పెద్ద నెట్‌వర్క్‌తో ఈ అక్రమ రవాణా చేస్తున్నారా? అనే విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇలా రేషన్ బియ్యం ప్రజల దగ్గర నుండి కొని అక్రమ రవాణా చేయటానికి ప్రతి మండలానికి లేదా నియోజక వర్గానికి ఒక దళారీ వర్గం ఏర్పడింది. రేషన్ డీలర్లకు వారితో సంబంధాలు ఉన్నాయి. దళారీ వర్గం, డీలర్లు ఎంత కుమ్మక్కయినాగానీ అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఈ వ్యాపారం చేయటం అసాధ్యం. ఈ అక్రమ రవాణాలో స్థానిక పోలీసుల నుండి, అధికారులు, అధికార-ప్రతిపక్ష పార్టీల అండదండలు వున్నాయి. వీరికి మీడియా వారి అండదండలు కూడా వున్నాయి. ప్రతి నెలా వీరందరికీ వారి వారి స్థాయిని బట్టి సొమ్ము ముడుతుంటుంది. రాజకీయ నాయకులకు నెల మామూళ్ళతో పాటుగా పార్టీల అవసరాలకు లేదా పార్టీ కార్యక్రమాలకు సొమ్ము ముట్టజెప్పటం జరుగుతుంది. మీడియా వారికి సైతం నెల మామూళ్ళు అందుతున్న కారణంగా వారు కూడా వార్తలు ప్రచురించటం లేదు. ఒకవేళ సాధారణ తనిఖీలలో లేదా పైనుండి ఒత్తిడి వచ్చినపుడు పట్టుబడ్డ విషయాల గురించి నామమాత్రపు వార్తలు రాస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థలో నిజాయితీగా వుండి అక్రమాలకు అడ్డుకట్ట వేయటానికి ఎవరైనా అధికారులు లేదా మీడియా వారు ప్రయత్నించినా వారికి అన్ని వైపుల నుండీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి.
తీవ్ర నిరుద్యోగం ఉన్న మన వ్యవస్థలో యువకులు, టీనేజీ పిల్లలు కూడా తప్పని పరిస్థితులలో ఈ దళారుల దగ్గర పనికి చేరుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది యువకుల మీద కేసులు నమోదు కావటం, జైలుకు వెళ్ళటం జరుగుతోంది. పోలీసు రికార్డులలోకి ఎక్కిన తరువాత, ఏ ఉపాధి దొరకని కారణంగా యువకులు ఉచ్చులో నుండి బయటకు రాలేకపోతున్నారు. అలాగే అనేక వ్యసనాలకు బానిసలవుతున్నారు.
నూతన ఆర్థిక విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు...రేషన్ అక్రమ రవాణాని సాకుగా చూయించి...వస్తువుల సరఫరాకి బదులుగా నగదు బదిలీ చేయటానికి పూనుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బియ్యం ప్రజలు ఎవరూ తినటం లేదని...డబ్బున్న వారికి సైతం అడ్డదారిన రేషన్ కార్డులు వున్నాయని...అందువల్ల ఈ రేషన్ పథకంతో ఏవిధమైన ఉపయోగం లేదనే అసంతృప్తి ఉంది. సబ్సిడీకి బదులు నగదు బదిలీ మొదలైన తరువాత వంట గ్యాస్ సబ్సిడీ మాదిరిగానే చిన్నగా తగ్గించి ప్రజలకు రేషన్ అందించే బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకుంటుంది. అలాగని ప్రభుత్వం ఈ అక్రమ రవాణాని అడ్డుకోకపోతే ప్రజాధనం భారీ స్థాయిలో వృధా అవుతుంది. పేద ప్రజలకు, పౌర సరఫరాలు అందించి వారికి సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అప్రమత్తతతో మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోగలం.
- ఆంజనేయ రాజు,
డివైఎఫ్‌ఐ దాచేపల్లి మండల కార్యదర్శి.










