Sep 27,2023 01:14

నర్సీపట్నంలో మాట్లాడుతున్న లోకనాథం


ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, విలేకరుల బృందం
బలమైన ప్రజా పోరాటాలతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌, రైల్వే, ఎల్‌ఐసి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్న మోడీ ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలన్నారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు సిపిఎం చేపట్టిన బైక్‌ యాత్ర మంగళవారం సాయంత్రం పాయకరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో లోకనాథం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మాట్లాడకుండా మోడీకి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు సాధన కోసం నాడు సిపిఎం పాయకరావుపేట ఎమ్మెల్యే మండే పిచ్చయ్య రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పిచ్చయ్య ఉద్యమ స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు ఎమ్మెల్యేలు, ఎంపీలు నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. దేశభక్తి ముసుగులో ప్రభుత్వ పరిశ్రమలను అమ్మకానికి పెట్టి, అదానీ, అంబానీ ఆస్తులను పెంచుతున్నారని అన్నారు. లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోలేకపోతే ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రయివేటు పరిశ్రమలకు సొంత గనులు కేటాయిస్తున్న మోడీ ప్రభుత్వం, స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. మండల పెన్షనర్ల సంఘం నాయకులు వెంకటరమణ, డాక్టర్‌ గణపతి, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని పొరాటాలతో అడ్డుకోవాలన్నారు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప ఏ రాజకీయ పార్టీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడ్డంలేదని అన్నారు. ఈ సభలో సిపిఎం నాయకులు జగన్‌, రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, పద్మ, శ్రీను, రాము, బత్తిన నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : కృష్ణ బజార్‌ వద్ద జరిగిన సభలో యాత్ర రథసారథి కె.లోకనాథం మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు అప్పలనర్స, బి.జగన్‌, ఆర్‌.శంకరరావు, అడిగర్ల రాజు, అల్లు రాజు, సాపిరెడ్డి నారాయణముర్తి, ఈరెల్లి చిరంజీవి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కె.త్రిమూర్తులు రెడ్డి, కె.రామకృష్ణ పాల్గొన్నారు.
చింతపల్లి : స్థానికంగా జరిగిన బైకు యాత్రలో నాయకులు మాట్లాడుతూ గిరిజన చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నారో వివరించారు. ఆదివాసీలకు నష్టం చేకూర్చేలా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను తీసుకొస్తున్నారన్నారు. డిగ్రీ కాలేజ్‌ నుంచి యాత్ర ఉత్తేజపూరితంగా సాగింది. అనంతరం పాత బస్‌స్టాండ్‌ ఆవరణలో ఉన్న అల్లూరి, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్యపడాల్‌, మండల కార్యదర్శి పాంగి ధనుంజరు. జికె.విధి మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు. కొయ్యూరు మండల నాయకులు వై.అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం యాత్ర కొయ్యూరు మండలం తురుబడిగడ్డ మీదుగా నర్సీపట్నంలోకి ప్రవేశించింది.