Jun 05,2022 08:06

మెయిన్‌ రోడ్డు పక్కన దీర్ఘ చతురస్రాకారంలో వున్న చెరువు ఆక్రమణకు గురవ్వకుండా దాన్ని పార్కులా అభివృద్ధి చేసింది మున్సిపాలిటి. వచ్చిన వాళ్లను ఆకర్షించడానికి బోట్స్‌ తిప్పడం మొదలెట్టారు. అలా అది బోట్స్‌ క్లబ్‌గా పేరుగాంచింది. తనకు ఫేవరెట్‌ స్పాట్‌గా మారడంతో అక్కడికొచ్చి కూర్చున్నాడు కిరణ్‌. కొద్ది దూరంలో బెంచిమీద చదువుకుంటున్న జంట కనిపించింది.
యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు? ఎన్ని గొప్ప లక్ష్యాలు? వాటిని సాధించాలని ఎన్ని ఆలోచనలు? 'స్వప్న' వల్ల అన్నీ వెనక్కిపోయాయి. వేటి నుంచైతే తప్పించుకుందామని అక్కడికొచ్చాడో మరలా అవే ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి.
'నీకీ ఉద్దేశ్యం ఉందనుకోలేదు కిరణ్‌. మంచి స్నేహితుడివి అనుకున్నాను. నీ అమాయక మాటలకు ముచ్చటపడ్డాను. చనువు పెంచుకున్నాను. దానికే నువ్విలా ఊహించుకోవడం ఏం బాలేదు. కలిసి తిరిగినా, చనువుగా మాట్లాడినా అది ప్రేమేనా కిరణ్‌? ఇక చాలు కిరణ్‌. నన్ను వదిలేరు. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. బై...' అంది స్వప్న.
ఆమెతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాడు. ఎన్నో కలలు కన్నాడు. ఆమె పేరులానే ఆమెతో గడిపినవన్నీ స్వప్నాలేమో అనిపిస్తోంది. మనసును ప్రశాంతంగా చేసుకోవడానికి కళ్లు మూసుకున్నాడు.
బ బ బ
ఎమ్‌.సి.ఏ. మీద మక్కువతో మంచి ర్యాంక్‌ సాధించాడు కిరణ్‌. యూనివర్సిటీలో సీటు తెచ్చుకున్నాడు. కో-ఎడ్యుకేషన్‌ కొత్త బంగారు లోకంగా తోచింది. ఆలోచనలన్నీ ఆశలుగా మారి రెక్కలు విప్పి తాండవం చేశాయి. అతని ప్రమేయం లేకుండానే తల వంచేశాడు.
పల్లె నుండి వచ్చిన అతను వాళ్లందరిలో నెగ్గుకు రావాలంటే వాళ్లలాగే మారాలనుకున్నాడు. దుస్తులు, అలంకరణలో మార్పులు చేసుకున్నాడు. కేశాలంకరణలో నవీన పద్ధతులు అవలంభించాడు. మాటల చాటున దాగున్న అప్రియత్వాన్ని ఒలికించడం నేర్చుకున్నాడు. అతనిలో అతను కనిపించడం మానేశాడు. కొంతమంది మనుషుల అనుకరణలుగా మారిపోయాడు.
ఎప్పుడూ సంతోషంలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఆ సంతోషానికి కారణం 'స్వప్న' అని తెలుసుకున్న మిత్రబృందం అది 'ప్రేమే' అని తేల్చేశారు. వాళ్లే విశ్వజిత్‌, రితిన్‌. వాళ్ల మాటలు రుచించక వాళ్లిద్దరినీ పక్కన పెట్టాడు కిరణ్‌. ఇప్పుడు వాళ్లు చెప్పినట్లే చేసి, వాళ్ల మాటలకు బలాన్ని చేకూర్చింది స్వప్న.
ఆమెతో గడిపిన సందర్భాలతో, తల్లిదండ్రుల ప్రేమానురాగాలను పోల్చుకున్నాడు. తల్లిదండ్రుల వైపే త్రాసు మొగ్గు చూపింది. అక్కడితో విషయం మర్చిపోవాలనుకున్నాడు. మనస్సు మాత్రం గోల చేస్తోంది. బాధ నిలువెల్లా దహించేస్తుంది. తలపట్టుకొని కూర్చున్నాడు. భుజంపై చేతిస్పర్శ తగిలింది. కళ్లు విప్పి చూశాడు. ఎదురుగా ఆ ఇద్దరు మిత్రులు.
'ఎంత కంగారుపడ్డాం... అలా వచ్చేస్తే ఎలా?' అడిగాడు విశ్వజిత్‌.
'లౌక్యంగా తప్పించుకోవడం ఆడవారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి నువ్వింతటితో వదిలేరు. పదా రూమ్‌కెళ్దాం..' కిరణ్‌ చేయి పట్టుకొని లేపాడు రితిన్‌.
బయటకు మౌనంగా కనిపిస్తున్నా కిరణ్‌ అంతరంగంలో కల్లోలం జరుగుతోంది. దాన్ని వారిద్దరూ గుర్తించలేదు.
బ బ బ
ఎక్కడేం జరుగుతున్నా వాటితో సంబంధం లేని సూరీడు డ్యూటీ ఎక్కాడు.
'ఒరేరు రితిన్‌! మూవీకి టికెట్స్‌ బుక్‌ చెరు!' స్తబ్దుగా కూర్చున్న కిరణ్‌ను చూస్తూ చెప్పాడు విశ్వజిత్‌.
'ఓకే.. బుక్‌ చేస్తున్నా.. టికెట్స్‌ కన్‌ఫోర్మ్‌.. వెళ్దామా?' లేచాడు రితిన్‌.
'మీరెళ్లండిరా! నాకు ఇంట్రెస్ట్‌ లేదు' విముఖత వ్యక్తం చేశాడు కిరణ్‌.
'ఇంకా ఇలాగే ఉంటే ఎలా?' బ్యాగులోంచి పర్సు తీసి, జేబులో పెట్టుకున్నాడు విశ్వజిత్‌.
'తను జోక్‌ చేసిందేమో అనుకున్నా.. కాల్‌ చేస్తే కట్‌ చేస్తుంది. మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం లేదు.' బాధపడ్డాడు కిరణ్‌.
'నా మాట విని వదిలేరు రా..' చెప్పాడు విశ్వజిత్‌.
'మీరు అన్నంత ఈజీనా వదిలెయ్యడం? చెప్పినా మీకర్థం కాదు. నన్ను వదిలెయ్యండి. మీరు వెళ్లండి' విసుక్కున్నాడు కిరణ్‌.
'ఒంటికి తగిలిన చిన్న దెబ్బను మర్చిపోవాలంటే ఏదన్నా ఇన్సిడెంట్‌ జరగాలి. లేదా ఇంకా పెద్ద దెబ్బ తగలాలి. అప్పుడే ఒకదాని నుండి రెండోదానిపైకి మనస్సు మళ్లుతుంది. ఎప్పుడూ వీడి పక్కనే ఉంటున్నాం కదా.. అందుకే మన మాటలు వీడికి రుచించడం లేదు. వాణ్ని వదిలేరు. మనం సినిమాకెళ్దాం..' అంటూ బయలుదేరాడు రితిన్‌. అనుసరించాడు విశ్వజిత్‌. మారు మాట్లాడలేదు కిరణ్‌.
ఎర్రటి లంబు ప్యాంటు, పూల చొక్కా తొడుక్కుని యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన రోజు జ్ఞప్తికొచ్చింది కిరణ్‌కి. నల్లటి కళ్లద్దాలను ప్యాంటు జేబులో పెట్టుకుని కాల్‌ లెటర్‌ బయటకు తీశాడు. స్టైల్‌గా ఉండాలని అతను ధరించిన దుస్తులు సీనియర్స్‌ ర్యాగింగ్‌ చేయడానికి ప్రేరణనిచ్చాయి. అతను బెదిరిపోయాడు.
అప్పుడే అక్కడికొచ్చిన స్వప్న సీనియర్స్‌ ర్యాగింగ్‌కు కళ్లెం వేసింది. దగ్గరుండి అతని జాయినింగ్‌ ప్రాసెస్‌ చూసింది. అతనిలో ధైర్యం నింపింది. ఎలా నడుచుకోవాలో నేర్పింది. ఒక చిన్న సంఘటన ద్వారా అతని నేపథ్యాన్ని అంచనా వేసి, అతనికి చేదోడుగా నిలబడినందుకు ఆమెను ఆరాధించడం మొదలు పెట్టాడు కిరణ్‌. కానీ ఇప్పుడు, ప్చ్‌..
బ బ బ
లెక్కపెట్టలేనన్ని కళ్లతో చూసినా, లెక్కలేనన్ని సార్లు విన్నా తన పని తాను చేసుకుపోయే సూరీడు, మరో రెండు రోజులు ప్రయాణం సాగించాడు.
'అసలేం జరిగింది?' బోట్స్‌ క్లబ్‌లో కిరణ్‌ పక్కనే కూర్చుంటూ ఒకామె అడిగింది.
తెలిసిన వ్యక్తేమోనని పరీక్షించి చూశాడు. ఐదడుగుల ఎత్తు, జాగింగ్‌ డ్రెస్‌, షూ కట్టుకుని, వాటర్‌ బాటిల్‌ పట్టుకుంది. ముడతలు పడిన శరీరం ఆమె సీనియర్‌ సిటిజెన్‌ అని చెప్తుంది. ఆమెను ఇంతకుముందు చూసినట్లు అతనికి గుర్తులేదు. జాగింగ్‌ చేయడంతో ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటోంది.
'దేని గురించండి?' అడిగాడు కిరణ్‌.
'రోజూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావ్‌. మీ ఫ్రెండ్స్‌ అనుకుంటా.. వాళ్లతో గొడవ పడుతున్నావ్‌. కోప్పడుతున్నావ్‌. బాధ పడుతున్నావ్‌. నా గెస్‌ కరెక్ట్‌ అయితే నీది లవ్‌ ఫెయిల్యూర్‌.. యాం ఐ రైట్‌?' సూటిగా అడిగిందామె. ఆశ్చర్యాన్ని నింపుకుంది కిరణ్‌ మొహం.
'ఆర్చేవారా? తీర్చేవారా? మీకు దేనికండి?' కిరణ్‌ కసురుకున్నట్లు మాట్లాడాడు.
'అదికాదు బాబు...' ఏదో చెప్పబోయిందామె. అసహనంగా అక్కడ్నుంచి నిష్క్రమించాడు కిరణ్‌.
బ బ బ
ఎన్నో సంఘటనలకు సాక్ష్యం అయిన సూరీడు, మరో రోజు గడిపేశాడు.
ఆ రోజు పార్క్‌ మధ్యలో కూర్చొని, గడ్డిని పెరుకుతున్నాడు కిరణ్‌. వారం కితం ఇదేరోజు స్వప్నకు అతని గుండెలో ఆలయం కట్టి, పూజించడం మొదలుపెట్టాడు. ఆ రోజు అతని జన్మదినం.
సీనియర్స్‌ నుంచి వస్తున్న సాంప్రదాయంలా ఆ రోజు పార్కులో అతని జన్మదిన వేడుకలు జరిగాయి. అతన్ని హత్తుకుని 'శుభాకాంక్షలు' తెలిపింది స్వప్న. మొదటి హగ్‌లోని ఆత్మీయతను ప్రేమగా భావించాడు. నెల రోజుల్లో ఆమె పట్ల అతని విషయంలో జరిగిన అన్నింటినీ బేరీజు వేసుకున్నాడు. ఆమెనే తన జీవిత భాగస్వామి అనుకొన్నాడు. తన ప్రేమను తెలియజేశాడు. ఆమె కాదంది. తట్టుకోలేకపోయాడు.
అది గుర్తుకొచ్చి, తన రెండు మోకాళ్లలో తల పెట్టుకుని జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. అతని భుజానికి ఆత్మీయంగా చేతి స్పర్శ తగిలింది. తల పైకెత్తి చూశాడు. ఆ పెద్దామే అతన్ని పైకి లేపింది.
'మా తరంలో ఏదన్నా కష్టమొస్తే వెంటనే పెద్దవారితో చెప్పేవాళ్లం. వాళ్లు పరిష్కరించేవారు. ఈ తరం అలా కాదు. మీ తరం వాళ్లను ''ఏమైంది?'' అని అడగాలని చూసినా ''నీకెందుకు?'' అనే సమాధానం వస్తుంది. ''నాది కానప్పుడు నాకెందుకు?'' అని మా తరం వాళ్లూ సర్దిచెప్పుకోవడంతో మార్గనిర్దేశనం చేసేవాళ్లు కరువవుతున్నారు. మీ తరం గాడి తప్పుతోంది. ఒక సమస్యను ఎలా ఛేదించాలో తెలీక ఆత్మహత్యలకు పాల్పడుతోంది. నేనలా కాదు. ఏమైందో చెప్పు బాబు?' అంటూ సాంత్వనంగా మాట్లాడింది.
'నువ్వు అడిగింది ఇవ్వకపోతే నాకు చెప్పు. నాన్నతో నేను మాట్లాడతాను' అని ప్రేమగా చెప్పే అమ్మ గుర్తుకొచ్చింది. దాంతో ఆమెకు ఏ మాటా చెప్పకుండా వెనుదిరిగాడు కిరణ్‌.
బ బ బ
రెండు రోజుల అనంతరం పార్కులో అడుగుపెట్టాడు కిరణ్‌.
'నమస్తే అమ్మా! ఎలా ఉన్నారు?' ఆమెతో మాట కలిపాడు.
'ఇప్పటికైనా చెప్తావా?' అంటూ ఆమె ఆత్మీయంగా నవ్వింది.
'బాగా క్లోజ్‌గా ఉంది. ప్రపోజ్‌ చేస్తే ''నిన్నలా ఊహించలేదు'' అని అంటుంది.' అని టూకీగా చెప్పాడు కిరణ్‌.
'నువ్వంటే ఇష్టం. అంతేకానీ ప్రేమ కాదు. ఆ భేదం నువ్వు గ్రహించలేదు.'
'రెండింటికీ తేడా ఉందా?'
'మెచ్యూర్‌గా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది.'
'అయితే నాకు మెచ్యూరిటీ లేదంటారా?'
'ఉంటే ఇన్ని రోజులు బాధపడుతూ కూర్చోవు కదా..'
'ఎవర్నైనా ప్రేమించి ఉంటే మా ప్రేమ అర్థమవుతుంది.'
'ఆనందం, కోపం, చిరాకు, బాధల్లాంటి భావోద్వేగాలు ఎలా వచ్చి మాయమైపోతాయో ప్రేమ కూడా అలాంటిదే! చూపించాల్సినంతే చూపించాలి. తీసుకోవాల్సినంతే తీసుకోవాలి. విచ్చలవిడితనం పనికిరాదు'
'ప్రేమ గురించి నాకేం తెలీదంటారా? నాది ప్రేమ కాదంటారా?'
'ప్రేమంటే తీయని అనుభూతే... ఆ అనుభూతి శరీర కలయికలను కోరుకుంటుందని నమ్మి, తప్పటడుగులు వేసే వయసు మీది. ఎవర్నో చూపించి ''మీ నాన్న ఇతనే'' అని పసిప్రాయానికి చెప్తే నమ్మొచ్చు. ఎవర్నో చూపించి ''మీ అమ్మ ఈమె'' అని చెప్తే అదే పసిప్రాయం నమ్మదు. ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? ఆ నమ్మకాన్ని కలిగించేది ప్రేమే. కాబట్టి ప్రేమంటే నీదేననుకోకు.. పాతికేళ్లుగా రాని స్పష్టత నెల రోజుల్లోనే వచ్చిందా? పెళ్లి చేసుకోవాలన్నంత ప్రేమ పుట్టిందా?' ఆమె అడగడంతో మెత్తబడ్డాడు కిరణ్‌.
'తనని మర్చిపోడమెలాగో తెలీడం లేదమ్మా..' పరోక్షంగా సలహా అడిగాడు.
'మీ పేరెంట్స్‌తో ఎన్నిసార్లు గొడవపడ్డావో గుర్తుందా?' ఆ ప్రశ్నకు జ్ఞాపకాల తవ్వకాల్లో మునిగిపోయాడు.
'గుర్తు లేదు కదా.. గుర్తుంటే వాళ్లనెప్పుడో వదిలేసేవాడివి. మరుపు అనేది దేవుడిచ్చిన వరం. కాబట్టి ఆమెను కూడా మర్చిపో..' అన్న ఆమె మాటలు అతనికి రుచించలేదు. మొహం తిప్పుకున్నాడు.
'ప్రేమించిన అమ్మాయి ఒప్పుకుందనుకో ఏం చేస్తావ్‌?' అతడి మనసుని గ్రహించి అడిగిందామె.
'పెళ్లి చేసుకుంటాను' సంతోషంగా చెప్పాడు.
'లవ్‌ మ్యారేజ్‌ అంత ఈజీనా?'
'ఇరువైపులు ఒప్పించే చేసుకుంటాను.'
'ఒప్పుకోకపోతే..'
'ఎదిరించైనా చేసుకుంటాను.'
'సరే.. ఇప్పుడున్నట్లు పెళ్లయ్యాక లేకపోతే.. కొన్నాళ్లకు ఆమె అభిప్రాయాలు మారిపోతే..'
'ఆమె అలాంటిది కాదమ్మా...'
'మాట వరుసకు అనుకుందాం. ఏం చేస్తావ్‌?' ఆమె రెట్టించి అడగడంతో ఏమీ మాట్లాడలేదు కిరణ్‌.
'ఎందుకు చేసుకున్నానురా.. అని బాధపడతావ్‌. నిజమేనా?' అతనివంకే చూసింది.
'అలా ఎలా మారిపోతారమ్మా..?' అతనికి అర్థం కాలేదు.
'పెళ్లికి ముందు ఊహించినట్లు, పెళ్లయ్యాక ఉండదు.. నాకా సంగతి బాగా తెలుసు..' చెప్పింది.
'మరేం చేయమంటారు?'
'సర్దుకుపోవడమే..'
'కుదరకపోతే..'
'కోపాలు.. తాపాలు.. గొడవలు.. ఎత్తుపల్లాల జీవనం.. మనశ్శాంతి కరువు..' నిట్టూర్చింది. ఆలోచించసాగాడు కిరణ్‌.
'ఇప్పుడు ఆమెలో ఏం చూశావో, ఏం నచ్చిందో, ఆమె నుంచి ఏం కోరుకుంటున్నావో ఇంకొకరిలో అవే ఉండవని ఎందుకనుకుంటావు?' లోతుగా ఆలోచించమంది. కిరణ్‌ నుంచి సమాధానం కరువైంది.
'గడిచిన కాలమెప్పుడూ జ్ఞాపకాలే. అవే మనల్ని నడిపిస్తాయి. అనుభవాల్ని నేర్పిస్తాయి. ఏదైనా పాఠం నేర్చుకుంటే దాన్ని ఆచరణలో పెడితే సరి. అప్పుడు సమస్య తీరిపోతుంది. చూడు నాయనా! నా కొడుకు లాంటివాడివని చెప్తున్నా. సాధారణ వ్యక్తిని అనన్య సామాన్యమైన శక్తిగా మార్చగలిగేది చదువే. దాని ద్వారానే ఉన్నతికొస్తావు. నువ్వు కోరుకున్నవే కాకుండా ఊహించనివీ నీ దరి చేరతాయి.' వివరిస్తోంది.
అంతలో, 'సరస్వతీ! త్వరగా రా.. ఆలస్యమవుతుంది' అనే పిలుపు వినిపించింది. ఆమె పేరు 'సరస్వతి' అని గ్రహించాడు కిరణ్‌.
'ఆ.. వస్తున్నాను' అంటూ బెంచి మీద నుంచి లేచింది సరస్వతి.
వెళ్లబోతూ వెనక్కి తిరిగి, 'ఒకటి గుర్తుంచుకో బాబు! ప్రేమ ఎప్పుడూ జటిలమే! మనం దానికి లొంగకూడదు. అదే మనకు లొంగాలి. పెద్దవాళ్లు ఎన్ని చెప్పినా అవన్నీ వాళ్ల అనుభవాలు, జ్ఞాపకాలే. వాళ్లనెప్పుడూ చులకనగా చూడొద్దు. వాళ్ల అనుభవమంత ఉండదు నీ జీవితం. ఎన్ని దెబ్బలు తింటే ఈ స్థానంలోకొచ్చారో ఆలోచించు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించింది లేదు, రాదు. అర్థం చేసుకో.. ''నా ప్రేమ, నా ఇష్టం'' అనుకుంటే నేనేం చెప్పలేను. ఆల్‌ ది బెస్ట్‌..' అని చెప్పి వెళ్లిపోయింది సరస్వతి.
ఆ క్షణం.. ఆ ఒక్క క్షణం.. నయనం వంగి, కన్నీరు కార్చింది. కిరణ్‌ చేతిలో తేమ పరుచుకుంది. సరస్వతి చెప్పినవన్నీ వరుసక్రమంలో అతని చెవున మారుమోగుతున్నారు. భ్రమ, ఊహల నుండి విముక్తి లభిస్తోంది. తలపైకెత్తి ఆమె వైపు చూశాడు.
కొంతమంది మాటలు ఆవేశం వచ్చేలా చేస్తారు. మరికొంత మంది మాటలు బాధను కలిగిస్తారు. ఇంకొంతమంది మాటలు తెగింపునిస్తారు. స్ఫూర్తినిస్తారు. ధైర్యానిస్తారు. సరస్వతి చెప్పినవి కిరణ్‌ మనస్సు లోతుల్లోకి చేరుకున్నాయి. బుద్ధిగా చదువుకుని, ఉద్యోగం సంపాదించమని తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
బ బ బ
'చెప్పాపెట్టకుండా వచ్చేశావే?' ఇంట్లోకి అడుగుపెట్టిన కిరణ్‌ను అడిగాడు తండ్రి.
'ఎలా ఉన్నావని అడగక్కుండా అలా అడుగుతారేంటి? నువ్వు కాళ్లు కడుక్కుని రా..' భర్తపై విసుక్కుని, కొడుకుని ప్రేమగా ఆహ్వానించింది తల్లి. బ్యాగు లోపలపెట్టి, కుర్చీలో కూలబడ్డాడు కిరణ్‌. వేడి వేడిగా టీ తీసుకొచ్చి ఇచ్చింది తల్లి.
'ఏమైంది నాన్నా? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావ్‌? డబ్బులేమైనా కావాలా?' పరధ్యానంలో ఉన్న కొడుకుని అడిగింది.
'లేదమ్మా..' చెప్పాడు.
'మరింకేంటి?' ఆరా తీసింది.
'ఆ పవన్‌ గాడిని ఊళ్లో అందరూ అలా పొగుడుతున్నారేమిటి?' బస్‌దిగి ఇంటికి వచ్చే దారిలో ఎదురైన సంఘటన నివృత్తి చేసుకోవడానికి అడిగాడు కిరణ్‌.
'ఓ అదా! వాడు ఒకప్పుడు ఆవారాగా తిరిగాడు. చదువుసంధ్యలు పక్కనెట్టి, ఆడపిల్లల వెంటపడ్డాడు. దేహశుద్ధి జరిగింది. దెబ్బకు బుద్ధి మారింది. అంతే పట్టుదల పెరిగింది. కసిగా చదివాడు. గవర్నమెంట్‌ జాబ్‌ కొట్టాడు. మనూరిలో ఆడే మొదటోడు. అందుకే అందరూ కుడోలు కొడుతున్నారు. వాళ్లకింకా తెలీదు. నా కొడుకు పెద్ద ఇంజనీర్‌ అయ్యి, ఆడికన్నా ఎక్కువ సంపాదిస్తాడని, మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడని. మనూరికి మంచిపేరు తెస్తాడని.. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా వెనకాడకుండా, తినో, తినకో నిన్ను చదివిస్తున్నాం..' అలవాటు ప్రకారం అడిగిన దాని గురించీ, అడగని దాని గురించీ చెప్పేసింది తల్లి.
ప్రేమ విఫలం అయినందుకు తలవంచుకుని బాధపడుతూ కూర్చోవడం కాదు, తల ఎత్తుకుని చైతన్య కిరణమై ప్రకాశించాలన్న సంగతి కిరణ్‌ మెదడులోకి చొరబడింది.
'అమ్మా! నేను సాయంత్రం బయలుదేరుతాను' అంటూ కర్తవ్య నిర్వహణకు నడుం కట్టాడు కిరణ్‌.

దొండపాటి కృష్ణ  90523 26864