Aug 04,2021 08:32

బీజింగ్‌ : చైనాలోని తియాన్‌జిన్‌ నగరంలో భారత్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన విదేశీయుడ్ని అరెస్టు చేశామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే నిందితుడు ఏ దేశానికి చెందిన వాడో ప్రకటించలేదు. బీహార్‌లోని గయాకు చెందిన అమన్‌ నాగ్‌ సేన్‌ చైనాలోని తియాజిన్‌ ఫారెన్‌ స్టడీస్‌ యూనివర్శిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుతున్నాడు. గత నెల 29న అనుమానాస్పద రీతిలో చనిపోయి కన్పించారు. ఈ ఘటనపై పిటిఐ అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన రాత పూర్వక సమాధానంలో భారత్‌కు చెందిన విద్యార్థి డార్మిటరీలో పడిపోయి కన్పించాడని తియాన్‌జిన్‌్‌ పోలీసులు అదే రోజు రాత్రి 8 గంటలకు ఫోన్‌ వచ్చిందని తెలిపారు. ప్రజా భద్రత సాయంతో విచారణ జరగపగా... హత్య కేసుగా తేలిందని, యూనివర్శిటీకి చెందిన మరో విదేశీ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలిందని పేర్కొంది. ఈ కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటన విషయాన్ని చైనా అధికారులు గత నెల 30, 31న ఇక్కడి భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారని , అక్కడి అధికారులతో మాట్లాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.