ప్రజాశక్తి - తాళ్లరేవు యుటిఎఫ్ కౌన్సిల్ సమావేశాల్లో సమర్పించే నివేదికలు చారిత్రక సాక్ష్యాలు ఉండాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు ఐ.ప్రసాద్ రావు అన్నారు. తాళ్లరేవు నామన వెంకాయమ్మ జెడ్‌పి హైస్కూల్లో ఆదివారం మండల శాఖ కౌన్సిల్ సమావేశం ఎం.తాతారావు అధ్యక్షతన నిర్వహించారు. పోరాటాలు, కార్యక్రమాల నివేదికను మండల ప్రధాన కార్యదర్శి గోపి సత్యనారాయణ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టే నివేదికలు భావితరాలకు చైతన్య స్ఫూర్తిగా నిలవాలన్నారు. విద్యారంగం పట్ల పాలకుల విధానాన్ని ప్రతి ఉపాధ్యాయుడూ అర్థం చేసుకోవాలన్నారు. సిపిఎస్‌కు బదులుగా జిపిఎస్ అమలు చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినా ఉపాధ్యాయ సంఘాలు మౌనం వహించడం మంచిది కాదన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పి చైర్మన్ దున్నా జనార్దన రావు, డి.సత్యనారాయణ, వీరేంద్ర, యువి.ప్రణామి, కెఎస్‌ఆర్‌కె.మోహన్, ఎం.బాలకృష్ణ, కౌలు రైతు సంఘం నేత వల్లు రాబాబు పాల్గొన్నారు.










