'ఉరలుంగల్ కోఆపరేటివ్ సొసైటీ' 95 సంవత్సరాల అనుభవంతో అద్భుతాలు సృష్టించింది. ఇది ప్రపంచంలోకెల్లా ఆదర్శవంతమైన, ఉత్తేజకరమైన కోఆపరేటివ్ కాంట్రాక్టు లేబర్ సొసైటీ.
1924 ఏప్రిల్‌లో మలబారు జిల్లా కో ఆపరేటివ్ సంఘాలు 'ఓట్టపాలెం'లో 800 మందితో సభ జరిగింది. జాతీయోద్యమ నాయకుడు శివరామ మీనన్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. శివరామ మీనన్ సందేశం 'మాతృభూమి పత్రిక'లో ప్రముఖంగా వచ్చింది. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకమైన పత్రిక ఇది. ఓట్టపాలేనికి వంద మైళ్ల దూరం లోని 'కరక్కొడ్' పంచాయతీలో ప్రతి రోజూ ఓ టీస్టాల్ దగ్గర చేరి పత్రిక చదువుతూ, చర్చించుకొనే టీ గ్రూపు మిత్రులపై ఆయన ప్రసంగం అంత పెద్ద ప్రభావం కల్గిస్తుందని ఎవరూ ఊహించలేదు. టీ తాగుతూ సహకార సంఘాల వార్తను చదివి ఉత్తేజితులైన వారు ఏర్పాటు చేసిందే 'ఉరలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ' (యు.ఎల్.సి.సి.ఎస్). ఇదే కాలంలో కేరళలో జరిగిన సంఘ సంస్కరణల ఉద్యమంలో భాగంగా 'నారాయణగురు' ప్రవచనాలు ప్రజలను కుల, మతాలకతీతంగా ఐక్యపర్చడం ద్వారా సహకార రంగానికి పునాదులు వేయడానికి తోడ్పడింది.
కేరళ ఉత్తర మలబారు లోని యుఎల్‌సిసిఎస్ ప్రత్యేక తరహాకు చెందిన సహకార సంఘం. సామాన్య పేద కార్మికులతో ఏర్పడిన సహకార సంఘం ద్వారా ప్రభుత్వ పనులు నిర్వహించి వచ్చిన లాభాలు పంచుకొనేవారు. సహకార సంఘాల లక్ష్యం ప్రకారం తమ సభ్యుల ఆర్థిక మెరుగుదలకు సరైన లాభకరమైన ఉపాధిని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు లేదా వ్యక్తుల నుంచి పొందడం, ఆ పనులు తమ సంఘ సభ్యులతో నిర్వహించడం, సభ్యుల మధ్య ఆర్థిక సహకారం అందించడం చేయాలి. తమ సంఘ సభ్యులకు అవసరమైన పరికరాలను ఉమ్మడిగా కొనుగోలు చేయడానికి సహకార సంఘం పని చేస్తుంది.
కష్టకాలంలో సొసైటీ
మలబారు జిల్లాలో ఉరలుంగల్ లేబర్ కాంట్రాక్టు కో ఆపరేటివ్ సొసైటీ 1925లో పని చేయడం ప్రారంభించింది. సంవత్సరం తరువాత మొట్టమొదట రోడ్డు మెయింట్‌నెన్స్ పని ఈ సొసైటీకి లభించింది. దానిని 1927-28లో పూర్తిచేశారు. తరువాత పని దొరకడానికి రెండేళ్లు పట్టింది. 1928-29 సొసైటీ టర్నోవర్ రూ.350 మాత్రమే. 1931-32 సంవత్సరం రూ.167 చిన్న కాంట్రాక్టు మాత్రమే సొసైటీకి దక్కింది. 1927 నుంచి 1933 వరకు (మొదట ఆరు సంవత్సరాలు) సొసైటీ పూర్తిగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. పనిలో అనుభవం లేనందున, రికార్డులు రాయడం తెలీనందున అధికారులు పనులు ఇవ్వడానికి సుముఖత చూపలేదు. కాంట్రాక్టర్ల పోటీని తట్టుకోవడం కష్టమైంది. పనులు ఇస్తే అనుభవం వస్తుంది. లాభాలు వస్తాయి. సొసైటీకి పనులు ఇవ్వాలని అధికారుల చుట్టూ సొసైటీ పెద్దలు తిరిగారు. 1932 నుంచి 1950 వరకు క్రమేణా సొసైటీకి పనులు పెరిగాయి. పనుల విలువ రూ. వందల నుంచి రూ. వేలకు పెరిగింది.
1944-45లో కార్మికుల జీతాలు ఒకేసారి పది అణాలు పెంచడం వల్ల అత్యధిక నష్టం (రూ.4370) వచ్చింది. అయినా స్వల్ప లాభాలు లేదా నష్టాలతో సొసైటీ నడిచింది. 1949-50వ సంవత్సర నికర లాభాం రూ.2,375తో ముగిసింది. అంటే 23 సంవత్సరాలు సొసైటీ చేసిన కృషికి ఫలితం స్వల్పం. ఈ కాలంలో సొసైటీ చాలా కఠినమైన పనులు చేపట్టింది. 23 ఏళ్లపాటు పట్టు వదలకుండా సొసైటీని నడిపించడం చిన్న విషయం కాదు. ఈ పట్టుదల, అనుభవం తరువాత కాలంలో ఉరలుంగల్ కాంట్రాక్టు సొసైటీ అద్భుతంగా ముందడుగు వేయడానికి తోడ్పడింది. 216 మంది సభ్యులతో ఉరలుంగల్ సొసైటీని ప్రారంభించారు. ఈ కాలంలో 113 మందిని తొలగించినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఆనాడు సభ్యుని ప్రవేశ రుసుము నాలుగు అణాలు. ప్రారంభ కాలంలో బోర్డు డైరెక్టర్లు సహా అందరూ కష్టపడి పనిచేసే కూలీలే. రాత్రి 9 గంటలకు ప్రతి రోజూ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరిపి తరువాత రోజు పని గురించి ప్లాన్ చేసుకొనేవారు. కఠినమైన నియమాలను సభ్యులంతా కచ్చితంగా అమలు చేసేవారు. ప్రతి జనరల్‌బాడీ సమావేశంలోనూ రూల్స్ చదివి సభ్యులందరికీ వినిపించేవారు.
1990 నుంచి ఉరలుంగల్ సొసైటీ వెనుదిరగకుండా వేగంగా అభివృద్ధి చెందింది. కఠినమైన పనులు, భారీ ప్రాజెక్టులు చేపట్టి జయప్రదం చేయడంలో సభ్యుల పట్టుదల ప్రధానమైనది. మొదట రోడ్డు పనులు మాత్రమే చేపట్టిన సొసైటీ 1950లో మొదటి బ్రిడ్జిని నిర్మించింది. తమిళనాడు నుంచి నిపుణులైన కార్మికులను రప్పించి పని పూర్తిచేయించింది. పనులు నైపుణ్యంగానూ, సకాలంలోనూ పూర్తిచేయడం వల్ల పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ సొసైటీకి ఏ క్లాస్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఇవ్వక తప్పలేదు.
ఒడిదుడుకులను అధిగమించిన సొసైటీ
పి.కనరన్ 1952 నుంచి 30 సంవత్సరాల పాటు ఛైర్మన్‌గా పనిచేశారు. 1984లో ఆయన హఠాన్మరణ ప్రభావం సొసైటీపై పడింది. టర్నోవర్ 1984-85లో రూ.81 లక్షలు వుండగా మరుసటి సంవత్సరానికి రూ.75 లక్షలకు పడిపోయింది. సొసైటీ కొత్త పనులు సంపాదించడంలో యాజమాన్యం విశ్వాసం కల్పించలేకపోయింది. తరువాత అధ్యక్షునిగా ఎన్నుకోబడిన పాతేరి రామేశన్ యాజమాన్యాన్ని సమర్ధవంతంగా నడిపించారు. 2005 వరకు మలబారు జిల్లాకే పరిమితమైన సొసైటీ 2005 నుంచి కేరళ రాష్ట్రమంతటా విస్తరించింది. అన్ని ప్రభుత్వ డిపార్టుమెంట్ల నుంచి పనులు సంపాదించగలిగారు. అత్యధిక పనులు ప్రభుత్వానికి సంబంధించినవే. ఇతర పనుల్లో ప్రయివేటు కో ఆపరేటివ్‌లు, పాఠశాల భవనాలు మాత్రమే వుండేవి. 2010-13 కాలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనులు సొసైటీకి రావడంతో చేతి నిండా పనులు వల్ల సొసైటీ అభివృద్ధి వేగం పెరిగింది. ఇదే కాలంలో ప్రభుత్వ పనులు చేపట్టడానికి గాను సొసైటీ అక్రిడేషన్‌ను సంపాదించడంతో స్థానిక పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ పనులు కూడా సమర్ధవంతంగా చేయగలిగింది.
1996లో ఏర్పడిన వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్‌ను ప్రవేశపెట్టింది. 1994లో రాజీవ్‌గాంధీ చేపట్టిన రాజ్యాంగ సవరణ 73, 74 లను కేరళ రాష్ట్రం చట్టాలలో మార్పులు చేసి వెంటనే అమలుకు పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు బదలాయించింది. కాంట్రాక్టర్ల స్థానంలో ప్రజలే పనులు చేపట్టే అవకాశం కల్గింది. దీనివల్ల కాంట్రాక్టర్ల లాభాలు నేరుగా ప్రజలకు అందడమే కాకుండా అవినీతిని అరికట్టగల్గింది.
రాష్ట్రంలో బలమైన శక్తిగా ఏర్పడిన ఉరలుంగల్ సొసైటీ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. స్థానిక ప్రజలు నిర్వహించలేని ముఖ్యమైన పనులు రాష్ట్రమంతా చేయడంతో రాష్ట్రంలో బలమైన సొసైటీగా ఆవిర్భవించింది. 2001-02లో 260 సభ్యత్వం వున్న సొసైటీ వాటాదారులు ఈ కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా సొసైటీ సభ్యత్వం 2004-05లో 155కు పడిపోయింది. 2006లో ఏర్పడిన వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం 2007-08లో సొసైటీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆ సంవత్సరంలో రూ.80 లక్షల విలువ కల్గిన స్థానిక సంస్థల పనులన్నీ సొసైటీకే దక్కాయి. దీంతో కాంట్రాక్టర్ల కోపం అవధులు దాటింది. సొసైటీ అధ్యక్షుడు టెండర్లు వేయడానికి ప్రభుత్వ కార్యాలయానికి రాకుండా భౌతిక దాడులకు...చివరకు చంపడానికి కూడా కొడం-బేలేరు పంచాయతీలో కాంట్రాక్టర్లు తెగబడ్డారు. కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజనీర్లు కుమ్మక్కయి టెండర్ విలువను బాగా తగ్గించారు. బిల్లులు ఆలస్యంగా చెల్లించడం లాంటి అనేక సమస్యలు సృష్టించారు. సొసైటీ ఇలాంటి అనేక ఇబ్బందులను, ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగింది.
సొసైటీ సొంత ఆస్తుల సమీకరణ
ఉరలుంగల్ సొసైటీ 70 సంవత్సరాల పయనంలో 2000 సంవత్సరం నాటికి వున్న ఏకైక ఆస్తి సెకెండ్ హ్యాండ్ లారీ మాత్రమే. అవసరాలకనుగుణంగా నెమ్మదిగా సొసైటీకి ఆస్తులు పెరిగాయి. 1960లో సొసైటీ ఆఫీసు కోసం కొన్న నాలుగు సెంట్లు, రోడ్లు నిర్మాణం కోసం ఇసుక సేకరించడానికి 39 సెంట్లు ఇసుక నేల ప్రారంభ స్థిరాస్తులు. కాలికట్ నగరం పక్కనవున్న 25 ఎకరాల భూమిలో 2011లో నిర్మించిన సైబర్ సిటీ ఒక సాహసోపేతమైన చర్య. దీనివల్ల సొసైటీ ఆస్తులు రూ.150 కోట్లకు పెరిగినా, సొసైటీ అప్పుల భారం కూడా పెరిగింది. 2000 సంవత్సరంలో క్రషర్ ఏర్పాటు కోసం సొసైటీకి 71 ఎకరాల భూమిని కోజికోడ్ పట్టణం పక్కన రూ.6 కోట్లతో కొన్నారు.
సైబర్ సిటీలో క్వార్టర్స్‌తో పాటు, సొసైటీ సభ్యులకు అవసరమైన ఆహారం పండించే పంట భూములుగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి సొసైటీ సభ్యులకు ఉదయం టిఫిన్ నుంచి రాత్రి ఆహారం వరకు అందిస్తున్నారు. 2001-05 మధ్య రోడ్డు పనులకు సంబంధించిన రూ.3.60 కోట్ల విలువైన రోడ్ క్రషర్, ఎర్త్ మూవింగ్ మిషనరీతో సహా యంత్రాలను సమకూర్చుకోవడం పెరిగింది. 2006-10 మధ్య కాలంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భారీగా బిల్డింగ్, బ్రిడ్జిల నిర్మాణానికి కావాల్సిన యంత్రాలను కొనడంతో స్థిరాస్తుల విలువ రూ.66.62 కోట్లకు చేరింది. ఉరలుంగల్ సొసైటీ స్వంతభూమి 224 ఎకరాలకు పెరిగింది. 1991 నాటికి రూ.10 లక్షల లోపు వున్న సొసైటీ ఆస్తులు 2011-13 నాటికి రూ.150 కోట్లకు పెరిగాయి. ప్రారంభంలో యంత్రాల స్థిరాస్తుల విలువ ఎక్కువగా వున్నప్పటికీ...భూముల విలువ పెరగడం వల్ల 2000 సంవత్సరం తరువాత భూ స్థిరాస్తుల విలువ 90 శాతానికి చేరింది.
(కేరళ మాజీ ఆర్థిక మంత్రి టి.ఎం. థామస్ ఐజాక్, మిచెల్లె విలియమ్స్ రచించిన 320 పేజీల 'బిల్డింగ్ ఆల్టర్‌నేటివ్స్' ఆధారంగా) /
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
సిహెచ్. నర్సింగరావు











