అనగనగా అవుసలపల్లి అనే గ్రామంలో కృష్ణ, సాయి అనే అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. పాఠశాలలో, గ్రామంలో అందరినీ పలకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కచెల్లెళ్లు లేకపోవడంతో చాలామందిని సొంత అక్క, చెల్లెలుగా పిలుచుకునేవారు.
ఒకసారి వారిద్దరూ చిన్న విషయానికి గొడవ పడ్డారు. మాట్లాడుకోవడం మానేసారు. ఆ రోజు వేరువేరుగా బడికి వెళ్లారు. ఊరందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలివిడిగా ఉండే వాళ్లు ఒక్కసారిగా మారిపోయేసరికి ఊరంతా ఆశ్చర్యపోయింది. వారిద్దరూ విడివిడిగా ఊరివారిని పలకరించడం చూసి, ఎవరూ వారికి సమాధానం ఇవ్వటం లేదు. ఆరోజు ఇంటికి వెళ్లాక కృష్ణ, సాయికి ఏదో దిగులుగా ఉంది. రాత్రి నిద్రపట్టలేదు. ఊరందరూ ఎందుకు మాట్లాడడం లేదో తెలియక దిగాలు పడ్డారు. తామిద్దరం కలసి పలకరిస్తే పలికిన వాళ్లు, విడివిడిగా పలకరిస్తే సమాధానం చెప్పకపోవడం వెనుక ఆంతర్యం తెలుసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి బడికి వెళ్లారు. వెళుతూ వెళుతూ ఎదురైనా ప్రతి ఒక్కరినీ పలకరిస్తుంటే ఊళ్లో వాళ్లు కూడా చక్కగా మాట్లాడారు. అప్పుడు వారిద్దరూ తమ తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వారిని చూసి గ్రామంలోని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కూడా కలిసి ఉండడం అలవాటు చేసుకున్నారు.
- బత్తుల భానుతేజ, 10వ తరగతి, జెడ్‌పిహెచ్‌ఎస్, హవేలీ ఘనపూర్,
మెదక్ జిలా,్ల 93919 92070.