Jul 30,2021 21:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా మాజీ సిబిఐ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా నియామకం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనను వెంటనే తొలగించాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడిక్కడ ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్స్‌ (ఐడబ్ల్యుపిసి)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం.తివారీ, కార్యవర్గ సభ్యురాలు ఆశాశర్మలతో కలిసి మాట్లాడారు. ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌గా రాకేష్‌ ఆస్తానా నియామకాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జెఎన్‌యు ప్రొఫెసర్‌ బికాష్‌ రామన్‌ మాట్లాడుతూ.. కరోనా రెండో దశలో అనేక మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. తాము ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో 1,917 మంది కార్మికులను సర్వే చేశామని తెలిపారు. మొదటి దశ కరోనా లాక్‌డౌన్‌లో వలస కార్మికుల దుస్థితి చూశామని, రెండో దశ కరోనా లాక్‌డౌన్‌లో శాశ్వతంగా నివాసముంటున్న కార్మికులను సర్వే చేశామని పేర్కొన్నారు. రెండో దశ కరోనాలో ఉపాధి పరిస్థితులపై ప్రభావం, ఎంత మంది కార్మికులకు కరోనా సోకింది, చికిత్సకు ఎంత ఖర్చు చేశారు, ఆహార ధాన్యాల పంపిణీ ఎలా జరిగిందన్న అంశాలపై సర్వే చేశామని తెలిపారు. తాము సర్వే చేసిన వారిలో 64 శాతం సాధారణ కార్మికులు, 16 శాతం నెలవారీ జీతాలు పొందేవారు, 7 శాతం స్వయం ఉపాధి (ఎలక్ట్రిషన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, టైలర్లు) పొందేవారు, 4 శాతం చిన్న వ్యాపారులు (చిన్న చిన్న దుకాణాదారులు, వీధి వ్యాపారులు) ఉన్నారని తెలిపారు. అందులో 67 శాతం మంది ఏప్రిల్‌లో తాము నిరుద్యోగులం అయ్యామని తెలిపారు. ఇది మేలో 72 శాతానికి పెరిగే అవకాశముందని చెప్పారు. అలాగే ఉపాధి ఉన్నవారికి వేతనాలు తగ్గాయని పేర్కొన్నారు. కార్మికులకు ఏప్రిల్‌లో రూ.9,149, మేలో రూ.8,381 వేతనాలు ఉన్నాయని చెప్పారు. కార్మిక కుటుంబాలకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఒక్కొక్కరు దాదాపు రూ.11,921 ఖర్చు చేసినట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి 78.5 శాతం మందికి కరోనా వ్యాక్సిన్‌ అందలేదని, 15.3 శాతం ఒక్క డోసే అందిందని, 3.8 శాతం మందికి రెండు డోసులు అందాయని తెలిపారు. ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించి 54.3 శాతం మందికి రేషన్‌ కార్డులే లేవని తెలిపారు. ఈ అంశాలన్నింటిని క్రోడీకరించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు లేఖ రాశామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారి తెలిపారు.