
న్యూఢిల్లీ : అసోం-మిజోరాం సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత్‌బిస్వా శర్మ సోమవారం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. అసోం ఎంపిలతో పాటు హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న అసోం సిఎం పలు కారణాల రీత్యా అమిత్‌షాతో భేటీ కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్) చీఫ్, ఎంపి అయిన బద్రుద్దీన్ అజ్మల్ కూడా అమిత్‌షాతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు తమ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం చర్చ జరిపితీరతానని అన్నారు. కేవలం మిజోరాం మాత్రమే కాదని, సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నాయని, తమ రాష్ట్రానికి నిర్ధిష్టమైన హద్దులు కావాలని ఆయన డిమాండ్ చేశారు. హోం మంత్రి అమిత్‌షా ఈ అంశానికి పరిష్కారం చూపించకుండా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని మిజోరాం గవర్నర్ డా. హరిబాబు కంభంపాటి అన్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని సిఎంలు ఆశిస్తున్నారని అన్నారు. గత నెల 26న జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులతో పాటు ఒక పౌరుడు మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. సరిహద్దుల్లో శాంతి భద్రతలు నెలకొనేందుకు కేంద్రం పంపిన ప్రత్యేక బృందాలు పహారా కాసేందుకు అంగీకరిస్తున్నట్లు ఇరురాష్ట్రాలు సంయుక్త ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే.