ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : పాఠశాల విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవడం ద్వారానే విజ్ఞానవంతులు కాగలరని కాకినాడ, గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తురగా శ్రీనివాస్ గారు తెలిపారు. కాకినాడ గాంధీనగర్ శాఖ గ్రంధాలయంలో ఆదివారం నాడు జరిగిన చదవటం మాకిష్టం సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలో గల దినపత్రికలు, ఇతర సాహిత్య పుస్తకాలను చదవటం ద్వారా విజ్ఞానవంతులు కాగలరని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ ములంపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా విన్న, చూసిన దానికన్నా పుస్తకములు చదువుట ద్వారా మంచి విజ్ఞానవంతులు కాగలరని తెలిపారు.కాకినాడ గాంధీనగర్ శాఖ గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నిర్వహించే చదవటం మాకిష్టం-సండే స్టోరీ టైం కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరుకావాలని కోరారు.










