Jul 29,2021 13:19

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతువు కృష్ణజింక (బ్లాక్‌ బక్స్‌). ఇది రాష్ట్ర జంతువుగా పేరుగాంచినా కనుమరుగయ్యే జంతువుల జాబితాలో ఇది కూడా చేరింది. మారుతున్న కాలానుగుణంగా.... వీటిని కూడా అక్కడక్కడా ఒకటో రెండో చూస్తూ ఆనందిస్తుంటాం. అదే వందలాది జింకలు ఒక్కసారిగా పరుగుపెడితే.. అది ఊహకే ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక నిజంగా అవి మన కళ్లెదుటే పరుగెడుతూ ఉంటే.... కనులవిందుగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతిని కలిగించేలా ప్రధాని నరేంద్రమోడీ వేలాది కృష్ణజింకలు తరలి.. చెట్లను, పుట్లను.. రోడ్లను దాటుతూ కొన్ని కిలోమీటర్లు పరుగెడుతున్న వీడియోను తన ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసి.. ఆయన అద్భుతంగా ఉంది అని కితాబు కూడా ఇచ్చారు. ఇంతకీ వందలాది జింకలు తరలి వెళ్లడం.. ఎక్కడ జరిగిందంటే.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలోని వేలావదార్‌ బ్లాక్‌బక్‌ నేషనల్‌ పార్క్‌ వద్ద.. వేలాది కృష్ణజింకలు రోడ్డు దాటుతున్న దృశ్యాన్ని గుజరాత్‌ సమాచారశాఖ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌నే ప్రధాని మోడీ రీట్వీట్‌ చేశారు. మందలాగా ఉన్న ఈ వీడియోలో మూడు వేలకు పైగానే కృష్ణజింకలు ఉన్నాయని.. అవి రోడ్డు దాటుతుంటే.. గాలిలో పైకి లేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయని సమాచార శాఖ తెలిపింది.
1972 వన్యప్రాణి చట్టం కింద బ్లాక్‌ బక్స్‌ వేటను నిషేధించారు. భావ్‌నగర్‌కు ఉత్తరాన ఉన్న వేలావదర్‌ నేషనల్‌ పార్క్‌ బ్లాక్‌బక్‌ జంతువులకు ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్‌ 34 చదరపు కిలోమీటర్లు విస్తీరణంలో విస్తరించి ఉంది. ఈ పార్కులో బ్లాక్‌బక్స్‌ జంతువులు మాత్రమే కాదు.. గణనీయమైన సంఖ్యలో పక్షులు కూడా ఉంటాయి. అలాగే పెలికాన్స్‌, ప్లెమింగోలు వంటి అనేక జాతుల వలస పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు.

వీడియో  : https://twitter.com/InfoGujarat/status/1420277621116473347?s=20