Sep 29,2022 08:18
  • ఇచ్చేశాం...అంటూనే వెనక్కి లాగే యత్నాలు
  • బిజెపి రాజకీయ నిర్ణయం నాటకమేనా?

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఒక్క రైల్వే జోన్‌ విషయంలోనే కాదు.. ఎపి విభజన చట్టంలోని అంశాలన్నింటిపైనా బిజెపి పెద్దల వ్యాఖ్యలు తలోదారిని సూచించేలా ఉంటా యి. తాజాగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ (సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌)పై ఇదే గోల కొనసాగు తోంది. కేంద్రంలోని బిజెపికి చెందిన నేతలు, మంత్రులు ఒకలాగ, రైల్వే మంత్రిత్వశాఖ లోని అధి కార యంత్రాంగం మరోలా రైల్వే జోన్‌పై ప్రకట నలు చేయడంతో గందరగోళం నెలకొంది. వాల్తేరు రైల్వే అధికారులు మాత్రం రైల్వే జోన్‌ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో ఈ నెల 27న జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీలు మినహా మంత్రులెవరూ పాల్గొన లేదని.. విశాఖలోని డిఆర్‌ఎం కార్యాలయం అధికారుల్లో తాజాగా చర్చ జరుగుతోంది. 'వారేం అన్నారో...వీరేం విన్నారో'' అంటూ రైల్వే ఉన్నతాధి కారులు, ఢిల్లీ రైల్వే యంత్రాంగాన్ని, మీడియాను ఉద్దేశించి విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయంలో ఆసక్తికర చర్చ బుధవారం జరిగింది. ఏదో ఒకవిధంగా రైల్వే జోన్‌పై గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలనే వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • డిపిఆర్‌పై భిన్న ప్రకటనలు

డిపిఆర్‌ను పరిశీలిస్తున్నామంటూ పార్లమెంట్‌ లో రైల్వే శాఖా మంత్రి పియూష్‌ గోయెల్‌ ప్రకటిం చారు. తాజాగా రైల్వే జోన్‌ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ రైల్వే శాఖ అధికారుల ప్రకటన తర్వాత 'వదంతులు నమ్మొద్దు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. డిపిఆర్‌ నిజంగా పరిశీలించలేదా? అంటే 2019లోనే డిపిఆర్‌ను ఆమోదించినట్లు రైల్వే ఉన్నతాధికారుల ద్వారా వెల్లడవుతోంది. తొలి డిపిఆర్‌లో రూ.300కోట్ల వరకూ ప్రతిపాదన పెట్టగా కేంద్ర రైల్వే శాఖ రూ.176 కోట్లకు సవరించి పంపించింది. గత ఒఎస్‌డి ధనుంజయ కాలంలోనే ఇది జరిగింది. ఉద్యోగులు, సిబ్బంది మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే బోర్డు కోరగా పంపించారు. అంటే డిపిఆర్‌ను పరిశీ లించడమే కాదు.. ఆమోదించడమూ జరిగింది... సవరణలు కూడా చేశారు.. అంటూ రైల్వే ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. రైల్వే జోన్‌ విశాఖ కేంద్రంగా ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నాటి రైల్వే శాఖా మంత్రి సురేష్‌ సహా నిత్య మూ బిజెపి నేతలు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నా రు. విశాఖ కేంద్రంగా ఇటీవల ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జివిఎల్‌ నరసింహారావు 'అంతా అయి పోయింది... జోన్‌ను ఆమోదించేశారంటూ ఆగస్టు 5న ప్రకటన గుప్పించారు. ఈలోగా మళ్లీ వివాదం రేపారు. సౌత్‌ కోస్ట్‌ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే నిర్మించేందుకు భూమి, నిధులు అందు బాటులో ఉన్నాయంటూ జివిఎల్‌ ప్రకటించారు. రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం పక్కనే నూతన సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కోసం 2017లోనే రైల్వే అధికారులు స్థలాన్ని సిద్ధం చేసి, డిపిఆర్‌లో పొందుపరిచారు. కానీ కేంద్రంలోని బిజెపి రాజకీయ జాప్యం చేస్తూనే ఉంది. అధికారులతో ఏదో ఒక ప్రకటన చేసి డ్రామాకు రక్తికట్టిస్తుంది.. అంటూ రైల్వేకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఎపి విభజన చట్టంలోనే కొత్త రైల్వే జోన్‌ అంశం ఉందన్నది రైల్వే అధికారులు వాపోతున్నారు. ఒఎస్‌డి కార్యాలయం కూడా 2017లో విశాఖలో ఏర్పాటైంది. అధికారిని కొనసాగిస్తున్నారు తప్ప జోన్‌ పని పూచిక పుల్లంతైనా ముందుకు కదల్లేదు. దీంతో రైల్వే శాఖలో ఢిల్లీ స్థాయి అధికారులూ 'జోన్‌ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారా? అనేది విశాఖ రైల్వే అధికారుల్లో చర్చ సాగుతోంది.

  • అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలి : సిపిఎం

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుపై అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం విశాఖలోని జగదాంబ జంక్షన్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు అంశం విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. మంగళవారం హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించారని, ఇది విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించడమేనన్నారు. వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను రాయగఢ్‌లో కలపడం దుర్మార్గమన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు కోసం విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు దీర్ఘకాలంగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే సంఘాలు, వ్యక్తులు, రైల్వేజోన్‌, వాల్తేర్‌ డివిజన్‌ రక్షణకు ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, సిపిఎం జగదాంబ, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం జోన్‌ కార్యదర్శులు ఎం.సుబ్బారావు, వి.కృష్ణారావు, యుఎస్‌ఎన్‌.రాజు పాల్గొన్నారు.