Sep 12,2023 11:13

సంబంధాల మెరుగుదలకు అంగీకారం
హనోయ్  : 
 శాంతి, సహకారం, సుస్థిర అభివృద్ధి కోసం తమ సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని వియత్నాం, అమెరికా అంగీకరించాయి. రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం హనోరు చేరుకున్నారు. అక్కడ వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నుగుయెన్‌ ఫూ ట్రాంగ్‌తో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఏళ్ళ తరబడి ఇరు దేశాల సంబంధాల్లో నెలకొన్న సానుకూల అభివృద్ధి పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. వియత్నాం - అమెరికా సంబంధా లను నిర్వచించే మార్గదర్శక సూత్రాలను పూర్తిగా గౌరవించా ల్సిన అవసరం వుందని వారు తెలిపారు. . ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది అత్యంత కీలకమైన అంశమని అన్నారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని, అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఇరు పక్షాలు గౌరవించా లని పేర్కొన్నారు. పరస్పర రాజకీయ వ్యవస్థలను, స్వాతంత్య్రాన్ని, సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకో వాలన్నారు. గతాన్ని మరిచి, విభేదాలను అధిగ మిస్తూ, సారూపత్యలను పెంచి పోషించుకుంటూ, భవితవ్యం వైపు దృష్టి సారిస్తూ ముందుకు సాగాలని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. బలమైన, స్వతంత్రతతో కూడిన, స్వావలంబన కలిగిన, సంపద్వంత మైన వియత్నాంను బైడెన్‌ అభినందించారు. పరస్పర అవగాహనను పెంచి పోషించుకోవాల్సిన అవసరం వుందని బైడెన్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, సహకారం పెరిగేలా పర్యటనలు, పరస్పరం మార్పిడులు పెరగాలని ఆయన అన్నారు. తూర్పు సముద్ర జలాలకు సంబంధించిన అంశాలపై వియత్నాం వైఖరిని, ఆసియాన్‌ వైఖరికి అమెరికా మద్దతివ్వడాన్ని ట్రాంగ్‌ అభినందించారు. శాంతి, భద్రత, సహకారాలకు అమెరికా మద్దతును కొనసాగించాలని కోరారు.