
హైదరాబాద్ : హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం 'భీమ్లా నాయక్' సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ సాంగ్ పై వివాదం రాజుకుంది. ఆ పాటలో లిరిక్స్ పోలీసులను కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో 'చెమడాలలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బక్క'..ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస' అంటూ పోలీసుల ప్రతాపం వర్ణించే విషయంలో రైటర్ రామజోగయ్య కాస్త అతిగా పదాలు వాడినట్టుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో.. కొందరు పాట బాగుందంటూ.. ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. పాట విడుదలైన 22 గంటల్లో 7 మిలియన్ల పైచిలుకు వ్యూస్‌తో ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
ఐపిఎస్ రమేష్ ట్వీట్..
తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బక్కలు మేం విరగ్గొట్టబోమని ఐపిఎస్ రమేష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.. అని ట్వీట్ చేశారు. పోలీసులంటే కుమ్మడం, బక్కలు విరగ్గొట్టేడమే కాదు అని ఐపిఎస్ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల సేవా గుణాన్ని పాటలో పేర్కొనకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
నెటిజన్ ట్వీట్..
మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు.. అంటూ రామజోగయ్య శాస్త్రికి ఓ నెటిజన్ సూచించారు. దీనికి స్పందించిన రామజోగయ్య శాస్త్రి నెక్స్ట్ టైమ్ బాగా రాస్తా తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు. నెటిజన్స్ కామెంట్స్ కి స్పందిస్తున్న రామజోగయ్య ఐపిఎస్ ట్వీట్‌కి కూడా స్పందిస్తారా వేచి చూడాలి.