Nov 13,2023 22:22

ప్రజాశక్తి - కడియం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నాయి. దీంతో చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడియం , కడియపులంక, వేమగిరి, తదితర గ్రామాల్లోని వీధుల్లో శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే హడలెత్తు పోతున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆగష్టు నెలలో 90 మంది, సెప్టెంబర్‌లో 107 మంది, అక్టోబర్‌లో 104 మంది కుక్కకాటుకు గురై కడియం ప్రభుత్వా సుపత్రిలో చికిత్స పొందినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క కడియం ప్రభుత్వాసుపత్రిలోనే కుక్కకాటుకు గురియైన వారి సంఖ్య ఈ స్థాయిలో ఉంటే, ఇక ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర మండలాల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం అవుతోంది. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని కుక్కలు వెంబడించడంతో వాహనదారులు ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. . దీనిని బట్టి ప్రజలపై కుక్కలు చేస్తున్న దాడుల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల ఉత్పత్తిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని, కుక్కల దాడుల నుంచి ప్రజలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామాల్లో ఉన్న కుక్కలను గుర్తించి వాటిని డాగ్‌ స్నేకర్స్‌ ద్వారా ఆధీనంలోనికి తీసుకుని, పశు సంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది ద్వారా కుటుంబ నియంత్రణ (మగ కుక్కలకు వేసెక్టమీ ఆపరేషన్లు చేయించడం), రేబిస్‌ వ్యాక్సిన్లు వేయించడం అధికార యంత్రంగానిదే బాధ్యత. కానీ కుక్కలను నిర్మూలించడం (చంపడం) సాధ్యం కాదనే సాకుతో చేతులెత్తేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక పశుసంవర్ధక శాఖ తీరు కందకు లేని దురద కత్తి పీటకెందుకన్నట్లుగా ఉంది. కడియం మండలంలో 11 గ్రామాలుండగా 2018-19 సంవత్సరానికి గానూ గుర్తించిన 7 గ్రామాల్లో 704 కుక్కలున్నట్లు అధికారిక గణాంకాల సమాచారం. మరో 4 గ్రామాల్లో కుక్కలు లేనట్లా?, గుర్తించడం జరగలేదా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ప్రజలకు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.