May 09,2021 11:05

  •  పోరాడితే నిండు జీవితం నీదే !!

పొగడదొరువు
73821 68168

కరోనా రక్కసి విరుచుకుపడుతున్న వేళ ... అత్యధిక సంఖ్యలో ప్రజల ప్రాణాలను తీస్తున్నది మాత్రం వైరస్‌ కాదు! భయం... కేవలం మన అంతరాంతరాళంలో పుట్టే భయం !! అవును.. మనలో పుట్టే భయం మనకు తెలియకుండానే శరీరమంతా వ్యాపిస్తోంది. మెదడును వశం చేసుకుని ఆలోచనలను శాసిస్తోంది ! తన చట్టూ తిప్పుకుంటోంది. చివరకు మరణశాసనం రాసి.. శ్మశానానికి దారి చూపుతోంది! కానీ, ఆ భయాన్ని జయిస్తే... 

   ఐసోలేషన్‌లోనో, ఆస్పత్రిలోనో, ఆక్సిజన్‌ బెడ్‌ మీదో, వెంటిలేషన్‌ మిషన్‌ మీదో ఉంటూ కరోనాతో పోరాడుతున్న మిత్రులారా... 'నా కేదో అయిపోతోంది' అన్న భయాన్ని వీడండి ! డాక్టర్లు ఏం చెబుతున్నారో అదే చేయండి. భయాందోళనల నుంచి మనసును తప్పించి కరోనా విలయం తరువాత ఏం చేయాలో ఊహాసౌధాలు కట్టండి. ఇటువంటి సానుకూల ఆలోచనలే ప్రపంచ వ్యాప్తంగా శతాధిక వృద్ధులను సైతం కరోనా పై పోరులో విజేతలుగా నిలబెడుతున్నాయి. నూరేళ్లు నిండిన వారే పెను రక్కసిని పరుగులు పెట్టిస్తుంటే నీవూ.. నేను, మనలాంటి మరెందరో ఆ పని చేయలేమా ? భయపడకు మిత్రమా... పోరాడితే నిండు జీవితం నీదే !

   రోనా వైరస్‌ వయో వృద్ధుల మీద తీవ్ర ప్రభావం చూపే సంగతి తెలిసిందే. అన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా పెద్ద వయసు వారు ఎందరో కరోనాను జయిస్తున్నారు. వీరిలో కొందరైతే ఒకటికి, రెండు సార్లు వైరస్‌ బారిన పడినా ఏ మాత్రం కంగారు పడకుండా పై చేయి సాధిస్తున్నారు. వైద్య రంగ నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం తాజాగా విరుచుకుపడుతున సెకండ్‌ వేవ్‌లో కరోనా రక్కసి యువకులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. యువకులు, మధ్య వయసువారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి పాలవుతున్నారు. వీరిలో కొందరు మృత్యువు ఓడిలోకి జారుకుంటున్నారు. ఒకవైపు పెద్దవారు విజేతలుగా బయటపడుతుంటే, వారికన్నా చిన్నవారు మరణానికి చిక్కడానికి కారణం 'భయం మాత్రమే..' అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మనదేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ కరోనాను జయించిన వృద్ధులు ఏం చెబుతున్నారో ఒక్కసారి విందామా...! 

                                                                         ధైర్యంగా ఉన్నా....

 ధైర్యంగా ఉన్నా....

   'కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే కొంత కంగారు పడ్డా... ఆ తరువాత ధైర్యంగా ఉన్నా. వైద్యులు చెప్పినట్టు చేశా'. ఇది కేరళకు చెందిన 110 సంవత్సరాల వారియత్‌ పథు చెప్పిన మాట! మల్లపురం జిల్లాకు చెందిన పథు గత ఏడాది ఆగస్టులో కరోనా బారిన పడింది. తన కూతురు నుండి ఆమెకు వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. అప్పటికి కరోనాపైనా, వైద్య విధానాలపైనా ఎటువంటి స్పష్టత లేదు. తనకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆమె ఏమాత్రం కంగారు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తన దగ్గరకు రావద్దని కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పేశారు. తన అస్వస్థత సమాచారాన్ని వైద్య శాఖ అధికారులకు, స్థానిక సిబ్బందికి తెలియచేశారు. వారి సహకారంతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చేరారు. అక్కడి వైద్య సిబ్బందికూడా ఆమెను జాగ్రత్తగా తీసుకున్నారు. 14 రోజుల తరువాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్‌గా తేలడంతో ఇంటికి పంపారు. 'ఆమె వైద్యులకు ఎంతగానో సహకరించారు. ధైర్యంగా ఉన్నారు. మేం ఏమి చెబితే అది మాత్రమే చేశారు. పథు కోలుకోవడం మాకు ఎంతగానో ఊరటనిచ్చింది. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ఎంతో మందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తుంది.' అని ప్రభుత్వ ఆస్పత్రిలోని డాక్టర్‌ చెప్పారు.

                                                         వైరస్‌తో పాటు వివక్షపైనా పోరాటం..

 వైరస్‌తో పాటు వివక్షపైనా పోరాటం..

   తమిళనాడులోని అంబూరు ప్రాంతం పెరియవారిక్కంకు చెందిన 110 సంవత్సరల హమీదాబీ వైరస్‌తో పాటు, వ్యాధి వచ్చిన కారణంగా ఇరుగు పొరుగు వారి నుండి వివక్షను సైతం ఎదుర్కోవాల్సివచ్చింది. అయితే, ఈ రెంటిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. హమాదాబీ కూడా గత ఏడాది తొలి విడత వైరస్‌ విజృంభిస్తున్న సమయంలోనే వ్యాధిగ్రస్తులయ్యారు. జలుబు, జ్వరంతో బాధ పడుతున్న ఆమెకు పరీక్షలు చేసిన అనంతరం కరోనాగా వైద్య సిబ్బంది నిర్ధారించారు. వెంటనే అంబూరులోని ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె 15 రోజులకు పైగా ఉండాల్సివచ్చింది. అయినా, ఏ దశలోనూ మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. తాను ధైర్యంగా ఉండటమే కాకుండా, పక్కన ఉండే ఇతర రోగులకు కూడా ధైర్యం చెప్పేది. వ్యాధి నయమై ఇంటికి వచ్చిన తరువాత మాత్రం ఇరుగు పొరుగు వారి నుండి సహాయ నిరాకరణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికార యంత్రాంగం గట్టిగా జోక్యం చేసుకున్న తరువాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. 'కరోనా కన్నా ఇరుగు పొరుగు వారు మమల్ని చూసిన తీరే ఎక్కువగా నన్ను భయపెట్టింది.' అని ఆమె ఆ తరువాత అన్నారు.

                                                                       ఎంద‌రు వృద్ధులు ?

mary florentaine
  mary florentaine

   

loose randen
    loose ramden
irees estin
      irees estin

ఒక అంచనా ప్రకారం 2021 మే ఏడవ తేది నాటికి ప్రపంచవ్యాప్తంగా 105 అంతకన్నా ఎక్కువ వయసున్న వారు 251 మంది కరోనా బారిన పడ్డారు.

  • 113 సంవత్సరాల ఫ్రెంచ్‌ మహిళ మేరి ఫ్లోరెంటైన్‌ను ఈ వ్యాధి బారిన పడిన అతి పెద్ద వయస్కురాలిగా గుర్తించారు. వైరస్‌ నుండి కోలుకున్న అనంతరం ఆమె ఇతర కారణాలతో 2020 డిసెంబర్‌ 19న మరణించారు.
  • ఫ్రెంచ్‌ దేశానికే చెందిన 116 సంవత్సరాల లూసీ రాండెన్‌ను వైరస్‌ సోకి బతికి ఉన్న వారిలో అతి పెద్దవారిగా ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తిచింది. అయితే, ఆమెకన్నా ఎక్కువ వయసు ఉందంటూ మరికొందరు చెప్పుకుంటున్నప్పటికీ ఆధారాలు లేవు.
  • 110 సంవత్సరాల చిలియన్‌ మహిళ ఐరీస్‌ ఎస్టీన్‌కు కరోనా వైరస్‌ రెండు సార్లు సోకింది. రెండు సార్లు ఆమే విజేతగా నిలిచారు. 

                                                          ఇటలీలోనూ రెండు పోరాటాల విజేత

ఇటలీలోనూ రెండు పోరాటాల విజేత

   1918లో విరుచుకుపడిన స్పానిష్‌ ఫ్లూతో పాటు, ప్రస్తుత కరోనా వైరస్‌తోనూ పోరాడి విజేతలుగా నిలిచిన కొద్దిమంది శతాధికుల్లో ఇటలీకి చెందిన ఆడా జూన్సు (103) కూడా ఉన్నారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా మూడవ వంతు మందికి సోకిన స్పానిష్‌ ఫ్లూ వంటి వ్యాధి మళ్లీ రాదనే ఆమె అనుకున్నారట. కానీ, తన జీవిత కాలంలోనే మళ్లీ అటువంటి విపత్తును ఆమె చూశారు. తాజాగా విరుచుకుపడిన కరోనా వైరస్‌ గత ఏడాది ఏప్రిల్‌లోనే ఆమెకు సోకింది. ఆయాసం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాల కారణంగా జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా నిర్ధారణైంది. వెంటనే వైద్య సహాయం అందడంతో ఆమె సులభంగానే కోలుకున్నారు. ఆడా కోలుకోవడాన్ని శుభ సంకేతంగా వైద్యులు అభివర్ణించారు.

                                                                మూడు వారాలు యుద్ధం చేసి.... 

 మూడు వారాలు యుద్ధం చేసి.... 

   బ్రిటన్‌కు చెందిన 106 సంవత్సరాల కొనీ టిచ్చెన్‌ అనే మహిళ కరోనా వైరస్‌తో మూడు వారాల పాటు యుద్ధం చేసి మరీ గెలిచారు. న్యుమోనియా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఆమెకు జరిపిన పరీక్షల్లో కరోనా అని తేలడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే ఆమెను ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆస్పత్రిలో చేర్చక తప్పని స్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో చేరిన తరువాత కూడా ఆమె పెద్ద పోరాటమే చేయాల్సివచ్చింది. 'అన్ని దశలను చూశా. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లా. అయినా ఏ దశలోనూ ధైర్యం కోల్పోలేదు. ఆరోగ్యంగా బయటకు రావాలనుకున్నా వచ్చా..' అని డిశ్చార్జయిన తరువాత ఆమె చెప్పారు. 'మా బామ్మ ఎప్పుడూ ఆరోగ్యంతోనే ఉండేది. క్రమం తప్పకుండా వ్యాయమాలు చేసేది. అందుకే కరోనాను ఓడించగలిగింది.' అని 40 సంవత్సరాల ఆమె మనవరాలు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

                                                                అప్పుడూ .. ఇప్పుడూ విజేతే !

అప్పుడూ .. ఇప్పుడూ విజేతే !

   స్పెయిన్‌కు చెందిన 113 సంవత్సరాల మహిళ మారియా బ్రాన్‌యాస్‌ రెండు మహమ్మారులపై పోరాటం చేసి విజేతగా నిలిచారు. స్పానిష్‌ ఫ్లూ 1918లో విరుచుకుపడినప్పుడు ఆమెకు 9, 10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వయసులోనే కుటుంబంలోని ఇతరులతో పాటు వైరస్‌ ఆమెకు సోకింది. 'నిజంగా అది ఘోరం. ఇప్పట్లా వైద్య సౌకర్యాలు లేవు. పోయినోళ్లు పోగా ఎలాగో బతికి బట్టకట్టాం.' అని ఆమె ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పారు. తాజాగా గత ఏడాది మార్చిలోనే ఆమెకు కరోనా సోకింది. దీంతో అధికారులు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచేశారు. వారం రోజుల తరువాత జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో తిరిగి కుటుంబ సభ్యులను ఆమె కలిసింది. 'స్పానిష్‌ ఫ్లూనే కాదు; 1936-39ల్లో సివిల్‌ వార్‌ను కూడా చూశాను. నరకపు రోజులంటే నిజంగా అవి. వాటితో పోలిస్తే ఇది కష్టమే కాదు. అందుకే ధైర్యంగా ఉన్నా. ఏం జరిగితే అది జరుగుతుందని డాక్టర్లు చెప్పినట్టు చేశా. వారం రోజుల్లోనే కరోనా పోయింది' అని ఆమె చెప్పారు.


                                                                   ఆస్పత్రిలోనూ యుద్దమే...

  ఆస్పత్రిలోనూ యుద్దమే...

   రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన బిల్‌ లాప్సీ తన 104 సంవత్సరాల వయసులో కరోనా వైరస్‌ పై విజయం సాధించడానికి మరోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆయనతో పాటు కేర్‌ హోమ్‌లో ఉండే మరో 15 మందికి కూడా వైరస్‌ సోకింది. వీరందరినీ ఒకే ఆస్పత్రిలో చేర్చారు. అయితే, రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు క్లిష్టంగా మారాయి. పరిస్థితులు క్షీణించడంతో బిల్‌ స్నేహితుల్లో ఇద్దరు మరణించారు. మరో నలుగురిని వెంటిలేటర్‌ మీద ఉంచాల్సిన స్థితి వచ్చింది. మిగిలిన వారు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కున్నారు. అయితే, బిల్‌ మాత్రం ఏ దశలోనూ తొట్రుపాటుకు గురికాలేదు. వైద్యులు చెప్పిన మందులను వాడుతూ ధైర్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు ఆక్సిజన్‌ అవసరం కూడా రాలేదు. దీనిపై అడిగిన మీడియా ప్రతినిధులకు ఆయన 'ఏమో.. నేను భయపడలేదు, ధైర్యంగా ఉన్నా. అంతే ! ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.' అని జవాబిచ్చారు.

table

                                                                  ఇలా చేయండి

   జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలు మొదలుకాగానే ఇంట్లో వాళ్ళకి ఐసోలేషన్‌కు వెఢుతున్నానని చెప్పి ఒక రూమ్‌లోకి వెళ్లి, తలుపులు వేసుకోవాలి.

  • డాక్టర్‌కు ఫోన్‌ చేసి, కన్సల్టేషన్‌ తీసుకుని మందులు మొదలు పెట్టాలి. వారి సూచన మేరకు ఆర్‌టిపిసిఆర్‌ చేయించుకోవాలి.

 

  • ఆ రిజల్టు ఎలాగైనా రానీ, ఆ రోజు నుండి 15 రోజులు డాక్టర్‌తో కాంటాక్ట్‌లో ఉండాలి.

 

  • ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి తినాలి. తినడం, పడుకోవడంగా ఉండాలి. ఇంతకుమించి వేరే పని ఉండకూడదు. దగ్గొస్తే.. దగ్గాలి. తుమ్ముస్తే తుమ్మాలి. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలనిపిస్తే గదిలోంచే మాస్కు పెట్టుకుని మాట్లాడాలి. మొత్తంమీద మూడు పూటలా తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉండాలి.

 

  • నీళ్లు బాగా తాగాలి. మజ్జిగ బాగా తీసుకుంటూ ఉండాలి. డ్రైఫ్రూట్స్‌ బాగా తినాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. సిగరెట్లు మానేయాలి.

 

  • దగ్గు, జ్వరం ఎక్కువవుతుంటే డాక్టర్‌కు చెప్పాలి. వారి సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలు డాక్టర్‌కు చెప్పి మందుల్లో అవసరమైన మార్పులు చేయించుకోవాలి.

 

  • ప్రతి మూడు గంటలకు ఒకసారి పల్స్‌ ఆక్సిమీటర్‌ చూసుకోవాలి. 94 శాతం పైన ఉంటే కంగారే లేదు. 94 శాతం వచ్చినా ఆందోళన పడనవసరం లేదు. మందులు మారిస్తే మెరుగవుతుంది. గుండె జబ్బులు లేని వారు అప్పుడప్పుడూ కాసేపు బోర్లా పడుకుంటూ ఉండాలి.

 

  • రెండవ వారంలో జ్వరం, దగ్గు వంటివి పెరిగినా, ఆయాసం వంటివి వచ్చినా డాక్టర్‌కు చెప్పాలి. నూటిలో ఒకరికి మాత్రమే ఇలా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మనకు ఆ పరిస్థితి రాదని ధైర్యంగా ఉండాలి. పుస్తకాలు చదువుకుంటూ, ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడకుంటూ మిగిలిన రోజులు గడిపేయాలి.


                                            డాక్టర్‌ విరించి విరివింటి ఫేస్‌బుక్‌ వాల్‌ నుంచి

   (అత్యధిక మందికి ఇలా సరిపోతుంది. ఆక్సిజన్‌ లెవల్స్‌ 94 శాతం కన్నా దిగువకు పడిపోతుంటే డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి, అవసరమైతే ఆస్పత్రికి తరలించాలి.)

                                                                 ఇలా చేయకండి..

  • అనారోగ్యానికి ముందు

. టీకాలు వేయించుకోనవసరం లేదు. బలాదూర్‌గా వీధుల్లో తిరగొచ్చు. అసలు కోవిడ్‌ అనేదే లేదు. అదంతా ఒక గూడు పుఠాని.

  • జ్వరం వచ్చిన మొదటిరోజు

ఇది ఒక చిన్న ఫ్లూ జ్వరం మాత్రమే. నాకు కోవిడ్‌ రాలేదు. అసలు అది ఉంటేగా !!

  •  రెండవ రోజు

. ప్రతి జ్వరం కోవిడ్‌ అనుకోనవసరం లేదు. కొన్ని పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటే సరిపోతుంది.

  • మూడవ రోజు

పిసిఆర్‌ పరీక్ష అవసరం లేదు. సిటి స్కాన్‌ చేయించుకంటే అంతా స్పష్టంగా తెలిసిపోతుంది. (సిటి స్కాన్‌ మూడవ రోజు వరకు నార్మల్‌గా చూపిస్తుంది. లేదా తక్కువ స్కోరు చూపిస్తుంది. కాబట్టి ఇది కోవిడ్‌ కాదని అనుకుంటారు.)

  • నాల్గవ రోజు

ఇంకా జ్వరం ఉంది. సర్లే రక్త పరీక్ష చేయించుకుందాం. డాక్టర్‌ కన్సల్టేషన్‌కోసం డబ్బు ఎందుకు వృథా చేయాలి. అవే పరీక్షలు అతను చేయించుకోమని చెబుతాడు గదా. (టైఫాయిడ్‌ క్రాస్‌ రియాక్టివిటీ ఉన్నందున తప్పుడు పాజిటివ్‌ వస్తుంది. ఇది అందరికి అర్థం కాదు.)

  • ఐదవ రోజు

నేను అనుకున్నదే అయ్యింది. ఇది సింపుల్‌ టైఫాయిడ్‌ మాత్రమే. ప్రిస్క్రిప్షన్‌ కూడా అవసరం లేదు. కొన్ని యాంటీ బయాటిక్స్‌ తీసుకుంటే సరిపోతుంది. అనవసరంగా డాక్టర్‌కు ఫీజు ఎందుకు ?

  • ఆరవ రోజు

నిన్నటి నుండే గదా యాంటిబయాటిక్స్‌ వాడడం మొదలు పెట్టాను !

  • ఏడవరోజు

ఇంకా జ్వరం తగ్గలేదేమిటో !... డాక్టర్‌ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి సలహా అడిగితే పిసిపిఆర్‌ చేయించుకోవాలని చెప్పాడు. (ఆ ఫలితం రావడానికి 24 నుంచి 72 గంటలు పడుతుంది)

  • ఎనిమిదవ రోజు

ఏంటి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. అర్జెంట్‌గా ఆస్పత్రికి వెళ్ళాలి (కానీ, కోవిడ్‌ టెస్ట్‌ ఫలితం ఇంకా రాలేదు)

  • తొమ్మిదవ రోజు

ఆక్సిజన్‌ స్థాయిలు 95 శాతానికన్నా తక్కువగా ఉంది. కోవిడ్‌ నివేదిక వచ్చింది కానీ, ఎక్కడా బెడ్లు లేవు.

  • పదవ రోజు

90 శాతం కన్నా దిగువకు ఆక్సిజన్‌ స్థాయి. ఏదో ఓ బెడ్‌ దొరికింది. కానీ, ఉపశమనం రావడం లేదు.

  • పదకొండవ రోజు

వెంటిలేటర్‌ పైకి ....

  • పన్నెండవ రోజు

మృత్యు కౌగిలిలోకి...

    - (రవీంద్ర సింధు రెడ్డి ఫేస్‌బుక్‌ వాల్‌ నుంచి)

లక్షణాలు కనిపించిన వెంటనే స్పందిస్తే రూ. 200 నుండి 500 రూపాయల ఖర్చుతో నయం చేసుకునే అవకాశం
ఉంది. మొదట్లో నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత లక్షల రూపాయలు ధారపోసినా ఫలితం ఉండకపోయే ప్రమాదం ఉంది.