సిపిఎం కార్యాలయాలు, పార్టీ కార్యకర్తల ఇళ్ళపై, పత్రిక ఆఫీసులపై దాడులు జరిగిన నేపథ్యంలో... సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్...ఈ నెల 13న పీపుల్స్ డెమోక్రసీ కరస్పాండెంట్ జి.మమతకు...ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...
సిపిఎం కార్యాలయాలు, పార్టీ కార్యకర్తల ఇళ్ళపై ఈ నెల 8న విస్తృతంగా దాడులు జరిగాయి. ఎందుకిలా జరిగింది ?
సెప్టెంబరు 6వ తేదీన కథాలియా బ్లాక్‌లో ఒక కార్యక్రమం వుంది. ఈ బ్లాక్‌లో మెజారిటీ భాగం ధన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోకి వస్తుంది. ఇక్కడి ప్రజల మద్దతుతోనే పాతికేళ్ళుగా త్రిపుర శాసనసభలో ఈ నియోజకవర్గం నుండి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. త్రిపురలో బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతానికి రాకుండా నా మీద నిషేధం విధించారు. తొలి మూడు నాలుగు మాసాలు మినహా ప్రజలను కలుసుకోవడం కుదరలేదు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఫాసిస్ట్ భయోత్పాతం, దాడులు, మా మిత్రులు, కామ్రేడ్లపై దాడులు, వేధింపుల కారణంగా పరిస్థితి అనుకూలంగా లేదు. కనీసం వీధుల్లో నిలబడో బజారులో నుండో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. కాబట్టి, చాలా కాలం నుండి నేను అక్కడకు వెళ్లకుండా నిలువరించారని మీకు అర్ధమై వుంటుందనుకుంటాను. కానీ, ఆ ప్రాంత ప్రజలు నాకు ఆహ్వానం పంపారు. సెప్టెంబరు 6వ తేదీన ఎనిమిది స్థానిక డిమాండ్లపై పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ చేస్తున్నామని చెప్పారు. సామాన్యుల, మధ్యతరగతి, నిరుపేదల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్లే అవన్నీ. దాంతో వెంటనే నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను.
వాస్తవానికి, గత 42 మాసాల్లో, మూడు సందర్భాల్లో నా షెడ్యూల్డ్ కార్యక్రమం ప్రకారం వెళ్ళవద్దంటూ, పరిస్థితులు అనువుగా లేవంటూ పోలీసులు నన్ను కోరారు. ఆ తర్వాత, కొద్ది రోజుల విరామం అనంతరం ఆ కార్యక్రమాలకు హాజరయ్యాను. అక్కడకు వెళ్ళవద్దని ఓ పోలీసు అధికారి నన్ను కోరారు. కానీ, అలా ఆగడానికిగల కారణాలు నాకు కనిపించలేదు. ఒక ఎంఎల్‌ఎగా నా స్వంత నియోజకవర్గానికి నేను వెళ్ళాను.
ధన్‌పూర్ నియోజకవర్గం లోకి నేను ప్రవేశించగానే, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. వారి వెనక కొంతమంది ప్రజలు వున్నారు. వారు బిజెపి వ్యక్తులు మాకు వ్యతిరేకంగా ముఖ్యంగా నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టైర్లను తగలబెట్టారు. దాంతో ఒక పోలీసు అధికారి మమ్మల్ని ముందుకెళ్ళవద్దని కోరారు. చాలా సమస్యలు వస్తాయని చెప్పారు. ''ఎందుకు? ఆ కార్యక్రమంలో నేను పాల్గొనేందుకు సాయపడాల్సిన కర్తవ్యం మీదే కదా'' అని నేనన్నాను. పోలీసులు సానుకూలంగా స్పందించలేదు. నేను వెళ్ళకుండా చూడాలంటూ వారిపై రాజకీయంగా ఒత్తిడి వస్తోంది. అలాగే 45 నిముషాలు గడిచింది. చిట్టచివరకు, ఆ సబ్‌డివిజన్ ఎస్‌డిఎం నా దగ్గరకు వచ్చి ముందుకు వెళ్ళవద్దంటూ అభ్యర్ధించారు. ముందుకెళితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్నారు. అప్పుడు 'ఒక ప్రాంతానికి సంబంధించి ఎన్నికైన ఎంఎల్‌ఎగా నేను ముందుకు వెళ్లడానికి నాకు హక్కు వుంది' అన్నా. దాంతో, ఆ పరిస్థితుల్లో మమ్మల్ని ఇక ఎంత మాత్రమూ ఆపలేమని వారికి అర్ధమైంది. ఆ తర్వాత రోడ్లు, మిగిలిన పరిస్థితులు అన్నీ సుగమం అయ్యాయి. అయితే ముందుకు వెళ్లడానికి మా వాహనాలను అనుమతించలేదు. దాంతో మేం నడవనారంభించాం. భాష్పకూర్ దగ్గర మరోసారి దిగ్బంధించారు. ఈలోగా, పక్కల నుండి బిజెపి వ్యక్తులు కొంతమంది మార్చ్‌లో పాల్గొన్న వారిపై బాణాసంచా కాల్చారు. రాళ్ళు విసిరారు. వీటన్నింటినీ తట్టుకుని 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత, వాహనాలకు అనుమతించారు. మేం చేరాల్సిన చోటుకు చేరుకుని...అక్కడున్న భారీ జనాలతో ప్రదర్శనగా వెళ్ళాం. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం బిడిఓ కార్యాలయానికి వెళ్ళి సమావేశమైంది.
ఇదంతా బిజెపికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది రాజకీయంగా వారిని ప్రభావితం చేస్తుందని వారు భావించారు. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రజలు వారి డిమాండ్ల సాధన కోసం తరలివచ్చారు. ఆ డిమాండ్లు ఏంటి? ఉపాధి హామీ పథకం: పని దినాల సంఖ్యను పెంచాలి, వేతనాలను కూడా పెంచాలి. సకాలంలో వారికెవరికీ వేతనాలు అందడం లేదు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అంశంగా వారికి వుంది. ఇది కాకుండా, రహదారులు పాడైపోయాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిగా పని చేయడం లేదు. ఇంకా ఇలా చాలా వున్నాయి. వీటన్నింటి వల్ల ఇబ్బందులు పడుతున్నది సిపిఎం మద్దతుదారులు కాదు. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. బహుశా, వారు బెదిరించడం వల్ల మేం రాబోమని వారనుకున్నట్లున్నారు. పైగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు సమీకరించబడతారని కూడా వారనుకున్నట్లు లేదు. ఇవన్నీ చూసిన తర్వాత, వారికి ఆందోళన మొదలైందని అనుకుంటున్నాను. దీన్ని ఎదుర్కొనడానికి, ఆ రోజు నుండి అంటే సెప్టెంబరు 6 నుండి తీవ్ర స్థాయిలో వారు ఈ భయోత్పాత కార్యకలాపాలు ప్రారంభించారు.
ఇక వారి వైపు నుండి, అగర్తలాలో అదే రోజు సాయంత్రం బిజెపి మంత్రి పత్రికా సమావేశం పెట్టారు. 8వ తేదీ నిరసనలు వుంటాయని ప్రకటించారు. అసలు ఈ నిరసనలు ఎందుకు? మాకు తెలియదు. కొన్ని ఘర్షణలు జరిగివుండవచ్చు. అది సహజం కూడా-మీరు అడ్డుకుంటున్నారు. వారు వెళ్ళాలనుకుంటున్నారు, కాబట్టి, ఈ కారణంతో సిపిఎం కార్యకర్తలు, నేతలపై అన్నీ తప్పుడు ఫిర్యాదులు చేశారు. 8వ తేదీ, అదే ప్రాంతంలో ఎక్కడైతే మేం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామో వారు వారి కార్యక్రమాన్ని అక్కడా, రాష్ట్రం లోని ఇతర ప్రాంతాల్లో నిర్వహించారు. ఆ రోజున, అగర్తలాలో, మా రాష్ట్ర కార్యాలయం, మా జిల్లా కమిటీ కార్యాలయం, దినపత్రిక దేశర్‌కథ కార్యాలయం, ఇతర పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. అన్నీ తగలబెట్టారు, దోచుకున్నారు.
వాస్తవంగా జరిగిన ప్రధాన విషయం ఇది. భయోత్పాత ఎత్తుగడల ద్వారా ప్రజల గొంతులను నులిమివేయలేమని వారికి అర్ధమై వుంటుంది. ఎందుకంటే ప్రజలు మనుగడ సాగించాలి కదా. మనం ఇలాగే కూర్చుంటే, ఈ భయోత్పాతానికి మనం తలలు వంచినట్లైతే, మన ఆకలి తీరదని ప్రజలకు అర్ధమవుతోంది. దాంతో అందరం ఐక్యంగా వుండాలి. ఇళ్ల నుండి బయటకు రావాలి. ఇతర పార్టీలేవీ లేవు. కేవలం వామపక్షాలు, సిపిఎం మాత్రమే. వాస్తవానికి మనకోసం వారు పోరాడుతున్నారు. వామపక్షాలు లేకపోతే అక్కడ ఎవరూ లేరు. కాబట్టి మనం వారితో కలిసి సాగాలి. అదే వారి అసలు భయం. కాబట్టి అదే కారణమని నేను అనుకుంటున్నాను. నిజానికి గత నాలుగైదు మాసాలుగా మేం పరిశీలిస్తున్నదేమంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజల సంఖ్య పెరుగుతోందని.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీపై ఇంత దారుణమైన దాడులు ఎలా జరిగాయి? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పాలనా యంత్రాంగం పాత్ర ఏమిటి ?
ఇందుకు సంబంధించి నేను చెప్పాలనుకున్నదేమిటంటే, బిజెపికి ఒక విషయం అర్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఆర్థిక వాగ్దానాలు చేశారు. వాస్తవానికి ప్రజల్లో కొన్ని భ్రమలు కల్పించడానికి ఒక దార్శనిక పత్రం తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు వారు వాగ్దానాలిచ్చారు. కానీ ఎన్నికైన తర్వాత, ఈ హామీలు వేటినీ కూడా అమలు చేయలేమని వారికి అర్ధమైంది. కానీ, వారేం చెబుతున్నారంటే-వారు ఎన్నికైనపుడు, వీటన్నింటినీ అమలు చేయడంలో తాము విఫలమైతే ప్రజలు తమని ఉపేక్షించరని వారు భావించడం మొదలుపెట్టారు. దాంతో వారివన్నీ ప్రారంభించారు.
అందువల్లే, ఫలితాలు ప్రచురించిన రోజు, 2018 మార్చి 3న మధ్యాహ్నం నుండి వారు వామపక్షాల్లో ప్రధాన శక్తి అయిన సిపిఎం ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ దాడి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో వారేం వాగ్దానం చేశారో అవన్నీ బట్టబయలయ్యానని వారికి స్పష్టమైంది. కాబట్టి మీరిచ్చిన హామీల అమలు ఏది? అంటూ ప్రజలు అడగడం ఆరంభిస్తే, ముందు వాటిని అమలు చేయండి. మీరు కేంద్రంలో వున్నారు. రాష్ట్రంలో కూడా వున్నారు. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో వుంది. కాబట్టి రెండు ఇంజన్ల కారు వుందని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరేం చేయడం లేదు. ఇలా ప్రశ్నించడాన్ని ఆపివేసేందుకు గానూ, ప్రజల్ని ఇలా సమీకరించేందుకు నాయకత్వం వహించే వారిపై దాడులు చేస్తే, ప్రజల్ని సమీకరించే వారి సామర్ధ్యాన్ని అణచివేస్తే సరిపోతుందని వారు భావించారు. అందుకే ఈ దాడులు వారు ఆరంభించారు. ముందుగా సిపిఎం, తర్వాత వామపక్షాలు, ఇతర ప్రజాస్వామ్య, లౌకికవాద పార్టీలపై దాడులకు దిగాలనుకున్నారు. ఈ దాడులకు మౌలిక కారణాల్లో ఇదొకటని అనుకుంటున్నాను.
ప్రభుత్వ రాజకీయ నాయకత్వ నియంత్రణలో పాలనా యంత్రాంగం వుంది. వారు స్వంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. మా హయాంలో, ముందుగా మేం వారు చెప్పేది వినేవారం. ఆ తర్వాత మా వైఖరిని చెప్పేవారం. చర్చల తర్వాత, ఒక వైఖరి తీసుకోవడానికి లేదా కొన్ని సమస్యలను అధిగమించడానికి మేం ఒక నిర్ధారణకు వచ్చేవారం. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడంతా వన్ వే ట్రాఫిక్‌లా వుంది. ఇటువంటి పరిస్థితుల్లో, వాస్తవానికి పాలనా యంత్రాంగం, ప్రభుత్వ జేబుగా మారిపోయింది. లేదా ప్రభుత్వ రాజకీయ కార్యనిర్వాహక వర్గంగా మారిపోతుంది. వాస్తవానికి, రాష్ట్రంలో పోలీసులు తీవ్రవాదంపై సాహసోపేతంగా పోరాడారు. కానీ ఇప్పుడు పోలీసు బలగాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుండి, బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, దాని పాలనా తీరు ఎలా వుంది ? ప్రజలపై ఆ ప్రభావాలు ఎలా వున్నాయి ?
అది చాలా మౌలికమైన విషయం. తప్పుడు హామీలివ్వడం, వేటినీ అమలు చేయకపోవడం, చెప్పినదానికి పూర్తిగా ప్రతికూలంగా వ్యవహరించడం జరుగుతోంది. ఏడవ కేంద్ర వేతన కమిషన్ ద్వారా ఉద్యోగులను, మధ్య తరగతి ఉద్యోగులను వారు ప్రలోభ పెట్టారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ పేదలను ప్రలోభ పెట్టారు. ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పనిదినాలు, నేను ఏవో రెండు మూడు విషయాలే చెబుతున్నాను. ప్రతి ఏటా 50వేల ఉద్యోగాలన్నారు. ఇవన్నీ ఎలా చేస్తారని మేం ప్రశ్నించాం. వీటికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? వారు కేంద్ర ప్రభుత్వమే మాదన్నారు. మేం కలిసి వీటన్నింటినీ చక్కబెట్టుకోగలమన్నారు. ఇప్పుడు వారు అన్నీ ఆపేశారు. పూర్తిగా ప్రతికూలంగా మారిపోయారు. యువత ఒక్కటే అడుగుతున్నారు: మీరు చేసిన హామీల అమలేది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడా, అక్కడా ప్రసంగాలు చేస్తూ ఒకటే అంటున్నారు. మా వెనక పడకండి, ఈ మంత్రి ఇంటికి, ఆ మంత్రి ఇంటికి వెళ్ళకండి. మంత్రులు మీకు ఉద్యోగం ఇవ్వలేరు, మీకు ఎక్కడ నుండి ఉద్యోగం వస్తుంది? త్రిపురలో జనాభా నిష్పత్తి ప్రకారం, ఈ ఉపాధే దేశంలోకెల్లా ఎక్కువ అంటున్నారు. దానిపై వెంటనే నేను స్పందించాను. వామపక్ష సంఘటన ప్రభుత్వానిదే ఈ ఘనత అని చెప్పాను. మీకు తెలియకుండానే మీరు వామపక్ష సంఘటన ప్రభుత్వానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. పరిశ్రమలు లేవు. మౌలిక సదుపాయాలు లేవు. వీటన్నింటినీ మేం అభివృద్ధిపరచడం ఆరంభించాం. కాబట్టి వారు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.
ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని చావగొడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వ పనితీరు శూన్యంగా వుంది. ఇంకా చెప్పాలంటే మైనస్‌ల్లో వుంది. ప్రజలు విసుగు చెందుతున్నారు, వారి భ్రమలు తొలగిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో, పూర్తిగా అసమర్ధ నిర్వహణ నెలకొంది. మాది చాలా చిన్న రాష్ట్రం. కేవలం 40 లక్షల జనాభా వున్నారు. కానీ నేటికి దాదాపు 80 వేల మంది కోవిడ్ పాజిటివ్‌తో వున్నారు. 800 మందికి పైగా మరణించారు. డాక్టర్లు, నర్సుల కొరత చాలా వుంది. పారా మెడికల్ సిబ్బంది కూడా కొరతే. ఇలా చాలా సమస్యలున్నాయి. ఇక్కడ కరువు కాటకాలతో మరణాలు కూడా నమోదవుతున్నాయి. దారిద్య్రంతో అవయవాలు కూడా అమ్ముకున్న సంఘటనలు వున్నాయి. నిరాశా నిస్పృహలతో వలస పోతున్నారు. ముఖ్యంగా, గిరిజనుల పరిస్థితి మరింత దయనీయంగా వుంది. మా హయంలో, గిరిజనులపై మేం ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. వారి ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశాం. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఉపాధి, విద్య కోసం చర్యలు తీసుకున్నాం. ఆరోగ్య సంరక్షణ, వివిధ పథకాలు చేపట్టాం. కానీ, ఇప్పుడు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.
ప్రజలు చెప్పేది ఎవరూ వినడం లేదు. వామపక్షాలు కదులుతున్నాయి. వారిపై దాడులు జరుగుతున్నా ముందుకు సాగుతూనే వున్నారు. మేం వారితో కలిసి వుండాలనుకున్నాం. వారు ఇది గ్రహించి వస్తున్నారు. మూడేళ్ళ వ్యవధిలో, వారు ఏకాకులయ్యారు. ఇన్నాళ్ళు భ్రమలతో ఇబ్బందులు పడిన వారంతా తల పట్టుకుని తప్పు చేశామనుకుంటున్నారు. నా మొత్తం రాజకీయ జీవితంలో ఇలాంటిదెప్పుడూ చూడలేదు. గత 53-53 సంవత్సరాలుగా సిసిఎంతో కలిసి పని చేస్తున్నాను. వారి రోజువారీ అనుభవాల ద్వారా వామపక్ష ప్రభుత్వానికి, బిజెపి ప్రభుత్వాలకు మధ్య గల తేడాను తెలుసుకోవడం ఆరంభించారు. అందుకే వారు బయటకు వస్తున్నారు. దాంతో ప్రభుత్వంలో భయాందోళనలు మొదలై దాడులకు దిగుతున్నారు. కానీ భయాన్ని కల్పించడమనేది చిట్టచివరి పరిష్కారం కానేరదు.
సిపిఎంను, వామపక్ష సంఘటనను అణచివేయడానికి నిరంతరాయంగా ఇలా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ, ప్రజా సంఘాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజల సమస్యల్ని ఎలా చేపడుతున్నాయి ?
నిజానికి ఇది చాలా కఠినమైన యుద్ధం. ఎందుకంటే, వారు మా నిర్వాహకులను, నేతలను, ముఖ్యంగా యువజన నాయకులను ఫాసిస్ట్ తరహాలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ దృష్టిలో వుంచుకుంటే మా పని తీరు మారాల్సి వుంది. కాబట్టి తొలి దశలో, కొన్ని సమస్యలు వున్నాయి. ఇంకా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ మా ప్రధాన కర్తవ్యం ఏమంటే, సామాన్యులతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. ప్రజలను తప్పుగా అర్ధం చేసుకోవద్దు, వారికి విశ్వాసాన్ని కల్పించాలి. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి. పార్టీ పని చేయడం కూడా కష్టమవుతోంది. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. లూటీ చేస్తున్నారు, తగలబెడుతున్నారు. అనేకమంది నేతలను చంపేశారు. గాయపరిచారు, పలువురు ఆస్పత్రుల్లో చేరారు. తమ నివాస ప్రాంతాల నుండి బలవంతంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీనివల్ల చాలా సమస్యలు తలెత్తాయి. వాస్తవానికి, మేం మా పని తీరును మార్చాం. ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం, స్థానిక సమస్యలను, రాష్ట్ర సమస్యలను, వర్తమాన సమస్యలను, ఆర్థిక సమస్యలను, జీవనోపాధి సమస్యలను చేపట్టడం-ఆ ప్రాతిపదికన మేం, పార్టీ, వామపక్షాలు, వివిధ ప్రజా, వర్గ సంఘాలు, పని చేయడం ఆరంభించాయి. విభిన్నమైన వేదికల నుండి త్రిపుర ప్రజలకిచ్చిన జాతీయ పిలుపులు ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ పిలుపులన్నింటికీ చక్కగా స్పందించడానికి త్రిపుర ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ప్రజల నుండి మాకు మంచి సాను కూల స్పందన వస్తోంది. అందువల్ల సెప్టెంబరు 8 దాడులను మిగతావాటితో వేరు చేసి చూడరాదు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూడాలన్నదే నేను చెప్పేది.










