Nov 01,2023 00:49

బాధితులను పరామర్శిస్తున్న కెవిపిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి - ఏలేశ్వరం
పెత్తందారుల దాడితో తిరుమాలి ఎస్‌సి పేటలో దళితులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఫ్లెక్సీ వివాదంలో పెత్తందారులు సోమవారం రాత్రి తిరుమాలి గ్రామంలో దళితపేటలో కర్రలు, రాడ్లతో చొరబడి విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ఈ దాడిలో తొమ్మిది మంది గాయపడగా, ముగ్గురిని ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలినవారు ఇళ్లలోనే ఉండిపోయి మంగళవారం ఉదయం కెవిపిఎస్‌, సిపిఎం, మాల మహానాడు నాయకులు సహకారంతో ఏలేశ్వరం ఆసుపత్రిలో చేరారు. తీవ్ర గాయల పాలైన సాకా ఏసుబాబు, దొమ్మేటి నీరుబాబులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన బోరా చంటమ్మ, మడికి దుర్గా జగదీష్‌, రాజాల కష్ణ, కుక్కల శ్రీను, సింగుళ్ల సిద్ధూ, సాకా మరిడియ్య, ఇంజుమళ్ళ రాజేంద్ర ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిపై దళిత మహిళలు సాకా అనసూయ, బోరా కామేశ్వరి మాట్లాడుతూ పెత్తందార యువకులు స్థానిక నేతల సహకారంతోనే దాడికి పాల్పడ్డారన్నారు. దుర్భాషలాడుతూ, కులదూషణకు పాల్పడుతూ సుమారు 60 మంది యువకులు నానా బీభత్సం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. భయంతో ఇళ్లల్లోకి పోయి తలుపులు వేసుకున్నామన్నారు. అయినా తలుపులు తన్ని భయాందోళనకు గురి చేశారన్నారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలి : కెవిపిఎస్‌
ఏలేశ్వరం మండలం తిరుమాలిలో దళితులపై విచక్షణా రహితంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు డిమాండ్‌ చేశారు. పెత్తందారుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల దళితులపై పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగి 20 గంటలు గడుస్తున్న ఇప్పటికీ టిడిపి జనసేన పార్టీల నాయకులు కానీ, అధికార పార్టీకి చెందినవారు కానీ కనీసం పలకరించడానికి కూడా రాకపోవడం శోచనీయమన్నారు.
దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం : డిఎస్‌పి
ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో దళితులపై దాడులు చేసి కుల దోషణ చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని పెద్దాపురం డిఎస్‌పి శ్రీలత తెలిపారు. ఆమె మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సోమవారం రాత్రి ఫిర్యాదు అందినప్పటినుండి గ్రామంలో ముగ్గురు సిఐల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపి పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ కొనసాగిస్తామన్నారు.