ప్రజాశక్తి-పాడేరు టౌన్: c ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవ్వడం తెలిసి ఉలిక్కి పడ్డారు. ఘాటీలో ప్రయాణం ఎంత క్షేమం అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా పాడేరు ఘాట్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అటు వాహనాలు నడిపే డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి. ఘాటీలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఘాటి రోడ్డుకు ఇరువైపులా దట్టంగా తుప్పలు, చెట్లు విపరీతంగా పెరగడంతో వాహనాలకు దారి ఇవ్వడం ఒక సమస్య అయితే, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో ఘాట్‌లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతే సంగతులు. పలుచోట్ల పొదలు, చెట్ల కొమ్మలు రోడ్డుపైకి విస్తరించాయి. ప్రమాదకరమైన మలుపుల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, దూరాన్ని తెలియజేసే మైలురాళ్లు కూడా కనిపించలేదు. సింగిల్ లైన్ రోడ్డు కావడం, ఆర్ అండ్ బి అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టక పోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
పలు మండలాలకు రాకపోకలు
పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖ నర్సీపట్నం మైదాన ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికిబంధ వరకు సుమారు 25 కిలోమీటర్లు ఘాట్ మార్గంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం తదితర పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చే పర్యటకుల వాహనాలు కూడా ఈ మార్గంలోనే వస్తుంటాయి.
పెరిగిన వాహనాల రద్దీ
పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంలో పోల్చితే ఈ మధ్య వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే స్థానిక ఘాట్ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ చేయడంలో నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
తుప్పల తొలగింపులో నిర్లక్ష్యం..
ప్రతి ఏడాది వర్షాకాలం తరవాత ఘాట్‌లో విధిగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి. కానీ, ఈ ఏడాది జంగిల్ క్లియరెన్స్ చేపట్టడంలో నిర్లక్ష్యం చూపడంతో ఘాట్ అంతా తుప్పలే దర్శన మిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎటువంటి జంగల్ క్లియర్స్ చేపట్టక పోవడంతో ఘాట్ మార్గంలో తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో, ఘాట్‌లోని రోడ్డు పక్కకు వాహనాన్ని దింపలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మలుపుల వద్ద ఎక్కువగా చెట్లు, చెట్ల కొమ్మలు, తుప్పలు మొలిచి పోవడంతో మలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక ఎక్కువ ప్రమాదాలకు ఆస్కారమిస్తున్నది. దీంతో, మలుపుల వద్ద ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రమాదాలు తప్పవని వాహన చోదకులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఘాట్ మార్గంలో ప్రమాదకరంగా మారిన తుప్పలను తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.
శిథిలావస్థలో రక్షణ గోడలు..
ఘాట్‌లో నిర్మించిన రక్షణ గోడలు ధ్వంసం కావడంతో పాడేరు ఘాట్ రోడ్డు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పలుచోట్ల మలుపుల వద్ద రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ప్రయాణాలకు వాహన చోదకులు భయాందోళన నడుమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆయాచోట్ల రక్షణ గోడలు లేకపోవడంతో ప్రయాణం ప్రమాదపరితంగా మారింది. మలుపుల వద్ద వందల అడుగులలోయలు ఉండడంతో ప్రయాణాలకు వాహన చోదలకు భయాందోళన చెందుతున్నారు. ఏమాత్రం ఆదమరచి ప్రయాణించిన ప్రమాదాల బారిన పడక తప్పదని చెబుతున్నారు. ప్రమాదాలు పొంచి ఉన్నందున రక్షణ గోడలను పటిష్టం చేసి ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి. అధికారుల స్పందించి శిథిలావస్థకు చేరుకున్న రక్షణ గోడలు ప్రదేశంలోని, రక్షణ గోడలు లేని చోట్ల నూతన గోడలను నిర్మించి ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని వాహన చోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.










