Oct 01,2023 21:30

ఫొటో : నిరసన చేపడుతున్న నాయకులు

భవ్యశ్రీ కి న్యాయం చేయాలి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో ఆదివారం భవ్యశ్రీకి మద్దతుగా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో భారీ మద్దతు ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా, పెనుమూరు గ్రామంలో సెప్టెంబరు 17న కనిపించకుండా పోయిన భవ్యశ్రీ (16) 4 రోజుల తరువాత విగతజీవిగా పాడుబడ్డ బావిలో శవమై తేలింది. గణేష్‌ నిమజ్జనంలో భాగంగా విగ్రహాన్ని బావి వద్దకు తీసుకువెళ్లగా బావిలో భవ్యశ్రీ మృతదేహం లభ్యమైంది. భవ్యశ్రీ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఉండడం చూస్తే గుండు చేయించి, కళ్లు పీకి, అత్యాచారం చేసి బావిలో పడవేసుంటారని ఊరి జనాలు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా భవ్యశ్రీ తరపున మాట్లాడే నాయకులు ఒక్కరు కూడా లేక పోవడం బాధాకరమని తెలిపారు. వడ్డెర కులానికి చెందిన భవ్యశ్రీ కి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.
ఆడబిడ్డను చంపిన వారిని పట్టుకోవడంలో పోలీసులు, నాయకులు విఫలమయ్యారని రోజా, వాసిరెడ్డి పద్మ కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడం బాధాకరమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు గుంజి గోపి, ప్రధాన కార్యదర్శి గుంజి నరేష్‌, కావలి నియోజకవర్గ అధ్యక్షుడు చల్లా లక్ష్మీ రావు, తదితరులు పాల్గొన్నారు.