
పీలేరు : భవ్యశ్రీ హంతకులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని మాల మహానాడు నాయకులు తెలిపారు. శనివారం మాల మహానాడు కార్యాలయంలో మాల మహనాడు రాయలసీమ జిల్లాల సహాయ కార్యదర్శి నగరిమడుగు సుభాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాల పురానికి చెందిన యువతిని హత్య చేసిన హంతకులను అరెస్టు చేయడంలో అక్కడి పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీపై ముగ్గురు అగంతకులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి, ఆ బాలిక కనుగుడ్లు పెరికేసి, జుట్టు కత్తిరించి అత్యంత పైశాచికంగా హత్య చేసి, బావిలో పడేసిన సంఘటన జరిగి 13 రోజులు అవుతున్నా, పోలీసులు ఇంతవరకు నిందితులను గుర్తించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ హత్యను 2019లో జరిగిన దిశ హత్య కంటే భయంకరమైందని తెలియజేశారు. దిశ సంఘటనతో దిశ చట్టం రూపొందింది, దిశ పోలీస్ స్టేషన్‌లు వచ్చాయన్నారు. భవ్యశ్రీ హత్య కేసులో ఇంతవరకు ఏవిధమైన పురోగతి లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో దిశకు పూర్తిగా న్యాయం జరిగింది, అనుమానితులను ఎన్‌కౌంటర్ చేసి దిశ ఆత్మకు శాంతి జరిగింది. నేడు కూడా ఇదే ప్రభుత్వం ఉంది దుస్సంఘటన తీవ్రత దిశ కంటే దారుణంగా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి హత్యకు గురైన భవ్యశ్రీ కుటుంబాన్ని ఆదుకుని, హంతకులను వెంటనే అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దిశ ఆధిపత్య కులానికి చెందిన అమ్మాయి దిశ సంఘటనకు పౌర సమాజం మొత్తం వ్యతిరేకించి గగ్గోలు పెట్టిన భవ్య సంఘటన పౌర సమాజానికి అవసరం లేదా అని ప్రశ్నించారు. పౌర సమాజం కుల వివక్షను తుంగలోతొక్కి సమన్యాయనికి సహకరించండి దిశ, భవ్య, ఇతరులు అందరూ మనుషులు మాత్రమే అని, కులం అంటగట్టి ప్రతిస్పందన ఒక నీచమైన చర్య మాత్రమే అని ఆవేదన చెందారు పెనుమూరు పోలీసులు వెంటనే హంతకులను అరెస్టు చేయని పక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో పెనుమూరు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, మండల కార్యవర్గ సభ్యులు చిరంజీవి పాల్గొన్నారు.