Nov 03,2023 23:53

చనిపోయిన కార్మికుడు, ఆందోళన చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి జారిపడి మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నాయకుల వివరాల ప్రకారం... మంగళ్‌దాస్‌ నగర్‌లోని ఓమేగా హాస్పిటల్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో, నాలుగో అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో తాపీ మేస్త్రీ బూర్లి శ్రీనివాసరావు (36) సెంట్రింగ్‌కు తూకం వేస్తూ జారి కిందపడి చనిపోయాడు. సదరు కార్మికుడి సొంత జిల్లా విజయనగరం. జీవనోపాధి కోసం గుంటూరు వచ్చి తాపీ పనిచేసుకుంటున్నాడు. కార్మికుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న యూనియన్‌ నాయకులు కార్మికుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని అపార్ట్‌మెంట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కార్మికుడు చనిపోయారని అన్నారు. నిర్మాణ సమయంలో కార్మికులకు రక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. లాభాలే ధ్యేయంగా భావిస్తూ సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ చర్యలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయటంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించటం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. మరోవైపు వైయస్సార్‌ బీమా పేరుతో ప్రచారం చేస్తున్నారే తప్ప చనిపోయిన కార్మికుడికి పరిహారం అందించట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, కార్మికుడి పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను భరించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును సక్రమంగా పనిచేయించి, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో సిఐటియు నగర కార్యదర్శి శ్రీనివాస్‌, నగర భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముత్యాలరావు, జీవన్‌, శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి పాల్గొన్నారు.
పరిహారానికి అంగీకారం
ఇదిలా ఉండగా ఆందోళనకు భవన యాజమాన్యం దిగివచ్చింది. నాయకులతో చర్చించి మృతుని కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతోపాటు మృతుని స్వస్థలానికి మృతదేహాన్ని తరలించేందుకు రూ.15 వేలనూ ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో ఆందోళన ముగిసింది.