Jul 04,2023 21:04

భవనంపై నుంచి కిందపడి విద్యార్థి మృతి

పాఠశాల యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదు
కొనసాగుతున్న విచారణ - ఎస్‌పి కె.కె.ఎన్‌.అన్బురాజన్‌ వెల్లడి
కడప అర్బన్‌ : కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్త నెల్లూరులోని బీరం శ్రీధర్‌రెడ్డి స్కూల్లో ఈ నెల ఒకటవ తేదీ ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి సోహిత్‌ ఐదవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందినట్లు ఎస్‌పి అన్బురాజన్‌ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిసి కెమెరాలను పరిశీలించిన తరువాత ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున 5.07 గంటలకు సోహిత్‌ ఒంటరిగా హాస్టల్లో ఉన్న మంచం మీద నుంచి లేచి ఇతర విద్యార్థులు నిద్రిస్తూ ఉండగా బయటికి వెళ్లాడని పేర్కొన్నారు. 5.08 గంటలకు పైఅంతస్తు మెట్లను వేగంగా ఎక్కాడని తెలిపారు. ఇనుప గేటు వద్దకు వచ్చి ఎవరూ లేని విషయాన్ని గమనించి గేటు తెరచి ఐదవ అంతస్తులో ఉన్న టెర్రస్‌ పైకి వెళ్లాడని చెప్పారు. 5.09 గంటలకు డిజిటల్‌ గేటు వద్ద అందుబాటులో ఉన్న పెద్ద రాయిని తెచ్చుకోవడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కుదరకపోవడంతో దానిని అక్కడే వదిలేసారని తెలిపారు. దగ్గరలో ఉన్న ఒక బకెట్‌ని బోర్లించుకుని గోడ ఎక్కారని చెప్పారు. గోడపై పాదాల మట్టి ముద్రలు గమనించామని పేర్కొన్నారు. 5.10 గంటలకు గోడ పైనుంచి కిందకు దూకాడని తెలిపారు. భవనం మొదటి అంతస్తు దగ్గర వి ఆకారంలో ఉన్న ఇన్సులేటెడ్‌ విద్యుత్‌ తీగలపై పడి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు వేలాడారని చెప్పారు. 5.18 గంటలకు హాస్టల్‌ ఆవరణలో నేలపై పడిపోయాడని పేర్కొన్నారు. 5.22 గంటలకు స్కూల్‌ సిబ్బంది రియాజ్‌ విద్యార్థి సోహిత్‌ పడి ఉండడాన్ని గమనించాడని తెలిపారు. విద్యార్థి వద్దకు పరిగెత్తి ఇతర సిబ్బందితో కలిసి విచారించారని చెప్పారు. కడుపునొప్పి అని చెప్పడంతో విద్యార్థి తండ్రికి ఫోన్‌ చేసి విషయం తెలియజేశారని పేర్కొన్నారు. అతని మేనత్త స్కూల్‌ వద్దకు రాగా చికిత్స నిమిత్తం పంపించారని తెలిపారు. చెన్నూరులోని ఆర్‌ఎంపి డాక్టర్‌ వెంకటేష్‌ వద్ద ప్రధమ చికిత్స చేయించుకుని, రెండు గంటలైనా కడుపునొప్పి తగ్గలేదని, విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు 9:15 గంటలకు విద్యార్థి చనిపోయినట్లు నిర్ధారించారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని పేర్కొన్నారు. జువైనల్‌ జస్టిస్‌ సెక్షన్‌ 75 కింద పాఠశాల యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఐదో అంతస్తు నుంచి ఎందుకు కింద పడ్డారనే దానిపై విచారణ సాగుతోందన్నారు.